మహానాడులో మహిళలకు చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోపై మంగళగిరి నియోజకవర్గ మహిళలు చంద్రబాబు నాయుడు కి ధన్యవాదాలు తెలియజేశారు. నియోజకవర్గ తెలుగుమహిళ అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి ఆధ్వర్యంలో మంగళగిరి ఎంఎస్ఎస్ భవన్‌లో సోమవారం నియోజకవర్గ టీడీపీ బీసీ మహిళలతో కలిసి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మహాశక్తి పథకం పేరుతో మహిళలకు వరాల జల్లు కురిపించిన చంద్రన్న థ్యాంక్యూ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆరుద్ర భూలక్ష్మి మాట్లాడుతూ మహిళల కోసం 'మహాశక్తి' పేరుతో 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డనిధి కింద నెలకు 1500 రూపాయలు నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతాయన్నారు. తల్లికి వందనం పథకం కింద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కోక్కరికి ఏడాదికి రూ. 15 వేలు అందిస్తారన్నారు. దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారని తెలిపారు.
ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా మహిళలందరికీ టికెట్టు లేని సౌకర్యం కల్పిస్తారని ఆరుద్ర భూలక్ష్మి చెప్పారు. బీసీలను ఆదుకుని, అండగా నిలిచి, అభ్యున్నతి వైపు అడుగులు వేయించే చంద్రన్నను అందరం కలిసి గెలుపించుకోవాలని ఈ సందర్భంగా కోరారు. బీసీలను దగా చేసిన జగన్ రెడ్డికి బీసీల సత్తా ఏంటో చాటి చెబుతాం అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి, రాష్ట్ర తెలుగుమహిళ కార్యదర్శి వింజుమూరి ఆశాబాల, నియోజకవర్గ తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి మంచికలపూడి వైష్ణవి, రాష్ట్ర అంగన్వాడీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి కోడవాటి జోజువాణి, దుగ్గిరాల మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీఅనిత, మంగళగిరి పట్టణ తెలుగు మహిళ అధ్యక్షురాలు ఊట్ల దుర్గమల్లేశ్వరి, తాడేపల్లి పట్టణ అధ్యక్షురాలు అన్నే కుసుమ, తాడేపల్లి రూరల్ మండల అధ్యక్షురాలు బొర్రా కృష్ణవందన, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి మహిళ నాయకులు పాల్గొన్నారు.