మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలో నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంపులను నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అకస్మకతనికి నిర్వహించారు. మంగళవారం ఆమె రెండవ జోన్ పరిధిలోని తోటగరువు జడ్పీ హైస్కూల్, పాత ఆరిలోవ జీవీఎంసీ కళ్యాణ్ మండపం, సెంట్ ఆన్స్ హై స్కూల్, డ్రైవర్స్ కాలనీలలో నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంపులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె సమ్మర్ కోచింగ్ క్యాంపు లలో ఏ ఏ క్రీడలుకు విద్యార్థులకు కోచింగ్ ఇస్తున్నారు, విద్యార్థులు ఎంతమంది పాల్గొంటున్నారు, వారికి అందించే డైట్ మొదలైన అంశాలను క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రతి ఏడాది విద్యార్థుల కొరకు సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని, నగర పరిధిలో 333 సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని, ఇందులో దాదాపు పదివేల మంది విద్యార్థులు పాల్గొంటున్నారని తెలిపారు.
బాస్కెట్బాల్, వాలీబాల్, కబడ్డీ, యోగా, కోకో, క్రికెట్, బాక్సింగ్ లాంటి 33 ఆటలకు తర్ఫీదు ఇస్తున్నారన్నారు. విద్యార్థుల కొరకు అందించే డైట్ ను పరిశీలించి, బిస్కెట్ ప్యాకెట్లు, మిల్క్, ఉడకబెట్టిన కోడిగుడ్డు, రాగిసంకటిలను పరిశీలించారు. ఈ వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థులు ఉత్సాహంగా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని సంతృప్తి వ్యక్తం చేస్తూ క్రీడల వలన విద్యార్థులలో మానసిక ఉల్లాసముతో పాటు శారీరక ఎదుగుదల, ఆత్మస్థైర్యంతో పాటు శారీరక దారుఢ్యం లభిస్తుందని, విద్యార్థులు విద్యతోపాటు ఏదో ఒక క్రీడలో కూడా రానిస్తారన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా విద్యార్థులు క్రీడల్లో పాల్గొనే విధంగా చూడాలన్నారు. విశాఖ నగరంలో ఎంతోమంది క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలలో ఆడారని, అలాగే ఈ శిక్షణా శిబిరాలలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పోటీలలో పాల్గొని విశాఖ కీర్తిని పెంపొందించాలని తద్వారా గేమ్స్ లో రాణించిన వారికి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయని , రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి క్రీడలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారని త్వరలో విశాఖ పరిపాలన రాజధాని అవుతుందని, విశాఖ నగరంలో క్రీడల కొరకు ప్రత్యేకంగా మైదానాలతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ఆడే ఇండోర్ స్టేడియంలో ఉన్నాయని, ఎంతోమంది క్రీడాకారులు ఇక్కడ తర్ఫీదు పొందుతున్నారని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు మేయర్ చేతుల మీదగా డైట్ అందించారు. ఈ ఆకస్మిక పర్యటనలో అదనపు కమిషనర్ డాక్టర్ వి సన్యాసిరావు, సానిటరీ ఇన్స్పెక్టర్, వివిధ క్రీడాకారులకు సంబంధించిన కోచ్ లు తదితరులు పాల్గొన్నారు.