మధ్యప్రదేశ్‌లో అమల్లో ఉన్న ముఖ్యమంత్రి కన్యా వివాహం లేదా నికా యోజన మరోసారి వార్తల్లో నిలిచింది. ఝబువా జిల్లాలో సామూహిక వివాహ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సామూహిక వివాహ వేడుకల్లో 296 జంటలు వివాహం చేసుకున్నారు. ఇందులో భాగంగా వధువులకు ఇచ్చిన వెడ్డింగ్ కిట్లు అందించారు. అయితే అందులోని మేకప్ బాక్సుల్లో కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు ఉండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో వెడ్డింగ్ కిట్లు అందుకున్న నవ దంపతులు.. అందులోని వస్తువులను చూసి అవాక్కయ్యారు. ఇటీవల నిర్వహించిన సామూహిక వివాహ మహోత్సంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు.
వెడ్డింగ్ కిట్‌లో కండోమ్‌లు, గర్భ నిరోధక మాత్రలు ఆరోగ్య శాఖ అధికారులు పెట్టి ఉంటారని జిల్లా సీనియర్ అధికారి భూర్సింగ్ రావత్ తెలిపారు. ఫ్యామిలీ ప్లానింగ్ గురించి కొత్త దంపతులకు అవగాహన కల్పించేందుకు ఆ కిట్లలో వాటిని పెట్టి ఉంటారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కన్యా వివాహం లేదా నికా యోజన కింద నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేస్తామని జిల్లా అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా రూ.49 వేలు అందిస్తామని చెప్పారు. సామూహిక వివాహ మహోత్సవానికి వచ్చిన వారికి ఆహారం ఇతర సదుపాయాల కోసం మరో రూ. 6 వేలు కూడా తామే అందిస్తామని తెలిపారు. అయితే పంపిణీ చేసిన వెడ్డింగ్ కిట్‌లలో ఏముందో తమకు తెలియదని భూర్సింగ్ రావత్ చెప్పారు.
ఈ ముఖ్యమంత్రి కన్యా వివాహ పథకం విషయంలో మధ్యప్రదేశ్‌లో ఇటీవల వివాదం చెలరేగింది. ఇందులో భాగంగా వధువులకు ప్రెగ్నెన్సీ పరీక్షలను నిర్వహించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దిండోరీలో జరిగిన సామూహిక వివాహ వేడుక సమయంలో వధువులకు ప్రెగ్నెన్సీ పరీక్షలు చేశారు. అయితే ఆ పరీక్షల్లో ఓ మహిళకు పాజిటివ్ వచ్చింది. సాధారణ వయసును తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహిస్తుంటామని.. ఆ వ్యక్తుల్లో రక్తహీనత ఉందో లేదో తెలుసుకునేందుకు పరీక్ష చేస్తారని దిండోరి వైద్య అధికారి తెలిపారు.
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళల వివాహాలకు ఆర్థిక సహాయం అందించడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ 2006లో ముఖ్యమంత్రి కన్యా వివాహం లేదా నికా యోజనను ప్రారంభించింది. పథకం కింద ప్రభుత్వం వధువు కుటుంబానికి రూ.55,000 అందిస్తుంది. అయితే ఇటీవల నిర్వహించిన సామూహిక వివాహ వేడుకల్లో గర్భ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం.. తాజాగా వెడ్డింగ్ కిట్‌లలో కండోమ్‌లు, గర్భ నిరోధక మాత్రలు పంపిణీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.