రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు తమ పోరాటాన్ని నిరాటకంగా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పతకాలు కోల్పోయిన తర్వాత తమ జీవితాలకు అర్థం ఉండదని అయినప్పటికీ ఆత్మగౌరవానికి భిన్నంగా రాజీ పడలేమని సాక్షి మాలిక్ బహిరంగ లేఖను విడుదల చేసింది. పతకాలు సాధించినపుడు అభినందించిన ప్రధాని.. ఇన్నిరోజులుగా ఆందోళన చేస్తుంటే.. ఒక్కసారి కూడా తమ గురించి అడగకపోవడం బాధాకరమన్నారు. తమను లైంగికంగా వేధించాడని బ్రిజ్‌భూషణ్‌పై ఆరోపణలు చేస్తే.. ఆయన మాత్రం.. తెల్లని దుస్తులతో కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్నారని లేఖలో సాక్షి మాలిక్ ఆవేదన వ్యక్తం చేసింది. ఇదిలావుంటే పార్లమెంట్ భవనం ప్రారంభం సందర్భంగా ఆదివారం జరిగిన పరిణామాలను దేశమంతా చూసిందని రెజ్లర్లు అన్నారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న తమపై పోలీసులు దారుణంగా వ్యవహరించారని.. పైగా తమపైనే కేసులు పెట్టారని ఆరోపించారు.