ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేసిన రెజ్లర్లు,,,పతకాలను గంగానదిలో కలిపేస్తామని వెల్లడి

national |  Suryaa Desk  | Published : Tue, May 30, 2023, 07:40 PM

రెజ్లర్ల ఆందోళన రోజురోజుకు పుంజుకొంటోంది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు.. తమ పోరాటాన్ని మరింత ముమ్మరం చేశారు. ఆదివారం కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడికి వెళ్లేందుకు యత్నించిన రెజ్లర్లను అడ్డుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత వారు ఆందోళన చేస్తున్న జంతర్ మంతర్ వద్ద గుడారాలను తొలగించి.. ధర్నాకు అనుమతి ఇవ్వబోమని ఢిల్లీ పోలీసులు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే భవిష్యత్ కార్యాచరణపై రెజ్లర్లు కీలక ప్రకటన చేశారు.


ఇన్నేళ్లు తాము కష్టపడి సాధించిన పతకాలకు ఎటువంటి అర్థం లేకుండా పోయిందని రెజ్లర్లు ఆందోళన వ్యక్తం చేశారు. అందు కోసమే తాము గెలుచుకున్న పతకాలను హరిద్వార్‌లోని గంగా నదిలో కలిపేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత ఇండియా గేట్‌ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని తెలిపారు. మహిళా క్రీడాకారులుగా తమకు న్యాయం చేయాలని కోరడం తప్పా అని ప్రశ్నించారు. ప్రస్తుతం తమ పట్ల ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో దేశం తరఫున పతకాలు ఎందుకు సాధించామా అని అనిపిస్తోందని వాపోయారు. ఇప్పుడు వాటికి ఎటువంటి అర్థం లేకుండా పోయిందని విలపించారు.


పతకాలను తిరిగి ఇచ్చేయడం అనేది మరణంతో సమానమని బజరంగ్ పూనియా ట్వీట్ చేశారు. కానీ ఆత్మాభిమానాన్ని చంపుకుని బతకడం కష్టమని పేర్కొన్నారు. తాము గెలుచుకున్న పతకాలను రాష్ట్రపతి, ప్రధాన మంత్రికి తిరిగి ఇచ్చేద్దామన్నా.. మనసు ఒప్పుకోవడం లేదని అన్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి.. ఇద్దరూ తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే హరిద్వార్‌ వద్ద పవిత్ర గంగా నదిలో పతకాలను కలిపేస్తామని తెలిపారు. తాము సాధించిన పతకాలే తమ ప్రాణాలని.. తమ ఆత్మలని బజరంగ్ పూనియా ట్వీట్‌లో పేర్కొన్నాడు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com