2022 ఏప్రిల్ నుంచి చెల్లించాల్సిన వేతన సవరణ ఒప్పందంపై ఇంధన సంస్థల యాజమాన్యాలకూ, రాష్ట్ర విద్యుత్తు సంస్థల ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలకూ మధ్య మంగళవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో తాము సమ్మెకు సిద్ధమవుతామని, ఈలోగా భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని యాజమాన్యానికి జేఏసీ నేతలు స్పష్టం చేశారు. విజయవాడ, గుణదల విద్యుత్తు సౌధలో డిస్కమ్‌ల సీఎండీలతో విద్యుత్తు సంస్థల జేఏసీ నేతల చైర్మన్ పి.చంద్రశేఖర్, సెక్రటరి జనరల్ పి.ప్రతాపరెడ్డి, కన్వీనర్ బి.సాయికృష్ణతో పాటు 28 సంఘాల నేతలూ వేతన సవరణపై చర్చలు జరిపారు. ఈ చర్చలు విఫలంకావడంతో.. గురువారం (జూన్ 1న) సమ్మె నోటీసు ఇస్తామని, జూన్ 19 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి.. వేతన సవరణపై యాజమాన్యం దిగిరాకుంటే.. ఒకటో తేదీ నుంచి దశలవారీ ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశాయి. ఈ సమాచారం అందుకున్న ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్.. బుధవారం ఉదయం 11 గంటలకు మరోదఫా చర్చలు జరుపుదామని జేఏసీ నేతలను ఆహ్వానించారు. తొందరపాటు నిర్ణయాలొద్దని హితవు పలికారు. బుధవారం నాటి సంప్రదింపుల తర్వాత నిర్ణయం తీసుకుందామని కోరారు. దీంతో.. ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమై బుధవారం చర్చించాల్సిన అంశాలతో పాటు.. యాజమాన్యం ముందుంచాల్సిన డిమాండ్లు.. భవిష్యత్ కార్యాచరణపై అనుసరించాల్సిన వ్యూహాలపై సమీక్షించారు.