తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. బ్లాక్ కమాండోలను తీసేస్తే... చంద్రబాబు ఫినిష్. వారున్నారనే ధైర్యంతో రెచ్చిపోతున్నాడు. ఎవరిని ఉద్ధరించేందుకు బ్లాక్ కమాండోలు..? నేను కేంద్ర ప్రభుత్వానికి స్పీకర్‌గా అప్పీల్ చేస్తున్నా... ఏ అర్హతతో చంద్రబాబుకి జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించారంటూ’ స్పీకర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను విపక్షాలు ఖండించాయి. స్పీకర్ వ్యాఖ్యల వెనుక కుట్ర కోణం దాగుందని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుండగా... అధికార వైసీపీ ఎంతకైనా దిగజారుతుందని సీపీఐ స్పష్టం చేస్తోంది. స్పీకర్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని, విచారణ చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. తమ్మినేని వ్యాఖ్యలను సీరియ్‌సగా పరిగణించాలని బీజేపీ, చంద్రబాబుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని సీపీఎం, తమ్మినేని సీతారాంపై కుట్ర కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడుపై సీతారాం చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని జనసేన ఖండిస్తోంది.