విశాఖపట్నం, జీవీఎంసీ పరిధిలో ఖాళీగా వున్న పారిశుధ్య కార్మికుల పోస్టుల (అవుట్‌సోర్సింగ్) భర్తీలో కొంత అయోమయం నెలకొంది. పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తూ మృతిచెందిన వారి వారసులతోపాటు అనారోగ్యం, అరవై ఏళ్లు పైబడిన కారణాలతో విధుల్లోకి వెళ్లలేకపోయిన కార్మికుల కుటుంబీకులకు ప్రాధాన్యం ఉంటుందని పేర్కొంటూ మొత్తం 482 పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ జారీచేశారు. అయితే భర్తీ ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ అంటూ తాత్కాలికంగా రోజువారీ కూలీ ప్రాతిపదికన జోన్‌ల వారీగా 300కిపైగా కార్మికులను అధికారులు నియమించుకున్నారు. అయితే వీరంతా అధికార పార్టీ కార్పొరేటర్లు సిఫారసు చేసినవారే. ప్రస్తుతం రోజువారీ కూలీపై చేరిన వారిని ఆప్కోస్‌లో నియమిస్తామని హామీ ఇచ్చి ఆయా కార్పొరేటర్లు రూ.1.5 లక్షల నుంచి రూ.రెండు లక్షల వరకూ వసూలు చేశారని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. పారిశుధ్య నిర్వహణలో అనుభవం కలిగి ఉన్నారంటూ తాత్కాలిక కార్మికులనే ఆప్కోస్ జాబితాలో చేర్చాలంటూ జీవీఎంసీ అధికారులపై ప్రస్తుతం కార్పొరేటర్లు ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆప్కోస్‌లో ఖాళీగా వున్న కార్మికుల పోస్టుల భర్తీలో మృతిచెందిన కార్మికుల వారసులు, అనారోగ్య కారణాలు, 60 ఏళ్లపైబడిన కారణాలతో విధులకు దూరమైన వారి కుటుంబీకులకే అవకాశం ఇవ్వాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం భారీ ధర్నా, ర్యాలీ నిర్వహించారు. జీవీఎంసీ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. మరోవైపు స్వయంగా జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్‌వర్మ ఇటీవల విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మృతిచెందిన కార్మికుల కుటుంబ వారసులుగా ఇప్పటివరకూ 77 మందిని గుర్తించినందున వారికి మాత్రమే జూన్ ఒకటిన నియామక పత్రాలు అందజేస్తామని, మిగిలిన ఖాళీల భర్తీపై తర్వాత ఆలోచిస్తామని స్పష్టంచేశారు. పోస్టుల పేరుతో ఎవరికీ డబ్బులు ఇవ్వద్దొని, భర్తీ ప్రక్రియ అంతా పారదర్శకంగా జరగుతుందని ప్రకటించారు. కమిషనర్ విలేకరుల సమావేశంలో అంత స్పష్టంగా ప్రకటించిన తర్వాత కూడా కార్మిక సంఘాల నేతలు మాత్రం పోస్టుల భర్తీలో కార్పొరేటర్ల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గే అవకాశం వుందని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఆప్కోస్ జాబితాలో చేర్చేందుకు అర్హులైన వారిని గుర్తించేందుకు గత కమిషనర్ నియమించిన ముగ్గురు అధికారుల కమిటీ 311 మందితో జాబితాను పక్కన పెట్టేందుకు యత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కార్పొరేటర్లు సిఫారసు చేసిన వారికే అప్కోస్ జాబితాలో చోటు కల్పించేందుకే ఆ కమిటీ నివేదికను పక్కనపెట్టేశారనే అనుమానాలను కార్మిక సంఘాల నేతలు వ్యక్తంచేస్తున్నారు.