ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఓటమి భయంతో పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నేతల గొంతు నొక్కాలని చూస్తున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబుకు వ్యతిరేకంగా ఊరూరా ప్లెక్సీలు కట్టిస్తూ రెచ్చగొడుతున్నారన్నారు. అనేక చోట్ల చంద్రబాబు మీద అసభ్యంగా ఫ్లెక్సీలు పెట్టిన విషయాన్ని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని మండిపడ్డారు. టీడీపీ నాయకులు ఫ్లెక్సీలు కడితే వెంటనే వాటిని తొలగించారని.. అదేమంటే వైసీపీ నేతల ఫ్లెక్సీలకు అనుమతి ఉందని పోలీసులే చెబుతున్నారన్నారు. మున్సిపల్ అధికారులు మాత్రం ఎవరికీ అనుమతి ఇవ్వలేదని అంటున్నారని తెలిపారు. వైసీపీ నాయకులకు కొంతమంది పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తమపై దాడులు చేస్తే వారిపై కేసులు ఉండవని.. తాము ప్రశ్నిస్తేనే కేసులు పెడుతున్నారని అన్నారు. ఇటువంటి పోలీసు అధికారులు భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. అవసరమైతే కోర్టుకు ఈడ్చి.. న్యాయస్థానంలో కూడా శిక్ష పడేలా చేస్తామన్నారు. వైసీపీ నాయకులు రెచ్చగొడుతున్నా.. వారి ఫ్లెక్సీలు తొలగించకపోవడం దారుణం కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విధంగా వ్యవహరిస్తే ప్రజల తిరుగుబాటు ఎలా ఉంటుందో చూపిస్తామని కొల్లు రవీంద్ర హెచ్చరించారు.