బీజేపీ, వైసీపీ, టీడీపీ పార్టీలపై కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ మూడు పార్టీలను దుష్టత్రయ పార్టీలంటూ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన... రాష్ట్ర విభజన జరిగి సరిగ్గా నేటికీ తొమ్మిదేళ్లు అని... ఈ తొమ్మిదేళ్లలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. బీజేపీ మోసగారితనం, వైసీపీ, టీడీపీల చేతగానితనం ఇందుకు కారణాలని ఆరోపించారు. రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సింది కొండంత అయితే.. ఇచ్చింది గోరంత అంటూ విమర్శించారు. విభజన సందర్భంగా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం సీమాంధ్రకు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక ఆర్థిక సాయం అంటూ మూడు వరాలిచ్చిందని గుర్తుచేశారు. మోడీ ప్రభుత్వం ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టిందని మండిపడ్డారు. బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ కింద రూ.24350 కోట్లకు గాను కేవలం రూ.1050 కోట్లు మాత్రమే ఇచ్చిందని తెలిపారు. మూడో వరం కింద రూ.5 లక్షల కోట్లకు గాను కేవలం రూ. 40 వేల కోట్లు మాత్రమే ఇచ్చిందని తెలిపారు. బీజేపీ చేతిలో వైసీపీ, టీడీపీలు కీలు బొమ్మలుగా మారాయని వ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డి భజన రెడ్డిగా, చంద్రబాబు చెక్క భజన బాబుగా మారిపోయారన్నారు. రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో దుష్టత్రయ పార్టీలైన బీజేపీ, వైసీపీ, టీడీపీలను ఓడించి కాంగ్రెస్ పార్టీనీ గెలిపించాల్సిన చారిత్రక ఆవశ్యకత ఎంతైనా ఉందని తులసిరెడ్డి పేర్కొన్నారు.