విజయనగరం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న శ్రీ త్రినాథస్వామి దేవాలయాన్ని తొలగించేందుకు ఆర్టీసీ సిబ్బంది యత్నించడం వివాదానికి దారి తీసింది. అభివృద్ధి పనుల పేరుతో సుమారు 45 ఏళ్ల నుంచి ఉన్న దేవాల యాన్ని తొలగించాలని అధికారులు చెప్పడంతో గ్రామస్తులు వ్యతిరేకించారు. దేవాలయాన్ని తొలగిస్తే ఒప్పుకొనేది లేదని పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఆర్టీసీ డీపీటీఓ సుధాకర్ ఆగకుండా దేవాలయంలో ఉన్న పటాలను తొలగించి, బయట వేసేశారు. గ్రామ సర్పంచ్ గౌరీశంకరరావు దీనిపై అభ్యంతరం చెబుతూ గ్రామస్థుల మనోభావా లు దెబ్బ తీయవద్దని, కుల వివాదాలు తేవద్దని నచ్చజెప్పినా ఆయన మొండి వైఖరితో దేవుడి పటాలు తొలగించారు. దీంతో గ్రామస్థులు ఆగ్రహించారు. ఇది మంచి పని కాదని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. సర్పంచ్ శంకరరావు మాట్లాడుతూ ఆలయాన్ని తొలగించే ఉద్దేశం ఉంటే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామ న్నారు. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్తామని చెప్పారు.