ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదాల్లో ఏపీ వాసి మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా జనన్నాథపురంకు చెందిన గురుమూర్తి మరణించాడు. తీవ్రంగా గాయపడిన మరికొంతమంది ఏపీ ప్రయాణికులకు ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. పలువురు క్షతగాత్రుల పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగువారిలో 141 మంది జాడ ఇంకా తెలియలేదు. వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తుండటంతో.. వాళ్లు క్షేమంగా ఉన్నారా? లేదా? అనేది అనుమానంగా ఉంది.
ప్రమాదం జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో 482 మంది ఏపీ ప్రయాణికులు ఉండగా.. ఇందులో 267 మంది క్షేమంగా బయటపడ్డారు. 113 మంది మిస్సయ్యారు. ఫోన్లకు ఈ 113 మంది అందుబాటులో లేకుండా పోయారు. విశాఖ నుంచి 76 మంది, రాజమండ్రి నుంచి 9 మంది, విజయవాడ నుంచి వెళ్లిన 28 మంది ప్రయాణికుల ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తున్నాయి. ఇక కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలను ఢీకొట్టి ప్రమాదానికి గురైన యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో 28 మంది ఏపీ ప్రయాణికుల ఆచూకీ ఇంకా లభించలేదు. రెండు ఎక్స్‌ప్రెస్‌లలో కలిసి 316 మంది ఏపీ వాసులు క్షేమంగా బయటపడగా.. 141 మంది ఆచూకీ లభ్యం కాలేదు.
ఈ 141 మంది ఎక్కడ ఉన్నారు? వీరి ఆచూకీ ఎందుకు తెలియడం లేదు? క్షేమంగానే ఉన్నారా? వేరే ప్రాంతంలో ఎక్కడైనా ఉన్నారా? ఫోన్లు స్విచ్చాఫ్ కావడానికి కారణాలేంటి? అనేది అనుమానాస్పదంగా మారింది. మిస్సయిన ఏపీ ప్రయాణికుల కోసం ప్రత్యేక బృందాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పంపించింది. మిస్సయిన ఏపీ ప్రజల కోసం అధికారులు ఆన్వేషిస్తున్నారు. సాంకేతిక పరిజ్జానంతో వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తోన్నారు. మంత్రి అమర్‌నాథ్ నేృత్వంలో ముగ్గురు ఐఏఎస్‌ల టీమ్‌ను ఒడిశాలోని రైలు ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించాలని సీఎం జగన్ శనివారం ఆదేశించారు. దీంతో ఆ బృందం ఒడిశాకు ఇప్పటికే బయలుదేరింది. ఏపీ ప్రయాణికుల కోసం అక్కడ చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టరేట్లలో ఏపీ ప్రభుత్వం హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసింది.
ఇదిలావుంటే ఒడిశా రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 294 మంది వరకు మరణించగా.. వెయ్యి మందికి గాయాలయ్యాయి. చికిత్స పొందుతున్నవారిలో ఎక్కువగా తెలుగువారు ఉన్నట్లు తెలుస్తోంది. మృతి చెందినవారి డెడ్ బాడీలను అయినవాళ్లు గుర్తించలేని అగమ్య పరిస్థితి నెలకొంది. మూడు రోజులవుతున్నా మృతదేహాలను గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆస్పత్రిలోనే మృతదేహాలు ఉన్నట్లు తెలుస్తోంది.