ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూతుర్ని హీరోయిన్ చేయాలని ఇంజెక్షన్లు ఇచ్చి ఒంటిని పుండు చేసేసింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 04, 2023, 03:58 PM

వెండితెరపై మోజుతో ఓ తల్లి కూతుర్ని హీరోయిన్ చేయాలని ఇంజెక్షన్లు ఇచ్చి ఒంటిని పుండు చేసేసింది. చెప్పుడు మాటలు విని.. అభంశుభం తెలియని చిన్నారిని ‘త్వరగా పెద్ద దాన్ని’ చేయడం కోసం హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వడం మొదలు పెట్టింది. తల్లి పెట్టే బాధ భరించలేని బాలిక చైల్డ్ లైన్ విభాగానికి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది.


బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రాష్ట్ర చైర్మన్ కేసలి అప్పారావు తెలిపిన వివరాల మేరకు.. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఓ మహిళ (40) నివాసం ఉంటోంది. ఓ కుమార్తె పుట్టాక ఆమె మొదటి భర్త చనిపోయాడు. దీంతో ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలు జన్మించాక ఆమెను వదిలేసి.. చిన్నారులను తీసుకుని ఆయన వెళ్లిపోయాడు. దీంతో ప్రస్తుతం ఆమె మరొక వ్యక్తితో కలిసి ఉంటోంది.


ఈ క్రమంలో మొదటి భర్తకు పుట్టిన బాలిక (15) విశాఖపట్నంలోని ఓ ప్రభుత్వ విద్యా సంస్థలో ఇటీవలే పదో తరగతి పూర్తి చేసింది. వేసవి సెలవులు కావడంతో ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో తల్లి వద్దకు తరచూ ఎవరెవరో వస్తుండటాన్ని గమనించిన బాలిక అక్కడ ఉండేందుకు ఇష్టపడలేదు. ఈ విషయమై తల్లితో గొడవపడేది.


ఇటీవల ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి ఆ బాలికను చూశాడు. బాలికకు హీరోయిన్ అయ్యే లక్షణాలు ఉన్నాయని, అయితే కొన్ని అవయవాలు బొద్దుగా పెరగాలంటూ నమ్మబలికాడు. అతడి సూచనల మేరకు కుమార్తెకు రోజూ ఏవేవో ఇంజెక్షన్లు ఇప్పించడం ప్రారంభించింది. ఈ క్రమంలో బాలిక అనారోగ్యం బారిన పడింది. బాధ భరించలేక, తల్లిని వేడుకున్నా విడిచిపెట్టలేదు.


దీంతో ఏం చేయాలో దిక్కుతోచక చివరికి గురువారం రాత్రి 1098కి ఫోన్ చేసి చైల్డ్‌లైన్ సిబ్బందికి తన దీనస్థితిని వివరించింది. వెంటనే అప్రమత్తమైన వారు జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు పోలీసుల సహకారంతో వెళ్లి బాలికను తమ అధీనంలోకి తీసుకున్నారు. అనంతరం బాలికను విశాఖపట్నంలోని స్వధార్ హోంకి పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేయాలని దిశ పోలీసులను కోరినట్లు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్మన్ కేసలి అప్పారావు తెలిపారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com