తెలుగు దేశం పార్టీ నాయకుడు ఆనం వెంకటరమణారెడ్డిపై దుండగులు దాడికి ప్రయత్నించారు. నెల్లూరులోని ఆర్టీఏ కార్యాలయం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కార్యాలయం నుంచి ఆనం వెంకటరమణారెడ్డి వస్తుండగా సుమారు 10 మంది బైక్‌లపై వచ్చి కర్రలతో దాడికి ప్రయత్నించారు. వెంటనే టీడీపీ కార్యకర్తలు, ఆనం అనుచరులు వారిని అడ్డుకుని ప్రతిఘటించడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.
ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు, ఆ పార్టీకి చెందిన ఇతర నాయకులపై ఆనం వెంకటరమణారెడ్డి ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దుండగులు దాడికి యత్నించినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, స్థానిక టీడీపీ నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, పలువురు పార్టీ నేతలు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి యత్నాన్ని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నాయకులు బరితెగిస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో పట్టపగలే దాడులు చేసే కొత్త సంస్కృతికి తెరలేపారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి జరిగిన సమాచారం పోలీసులకు తెలియజేస్తే.. ఇద్దరు కానిస్టేబుళ్లని పంపించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఇది సరైన పద్ధతి కాదని హితవుపలికారు.
ఆనం వెంకటరమణారెడ్డిపై దుండగులు దాడికి ప్రయత్నించిన ఘటనపై తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. ఇది వైసీపీ మూకల పనే అని మండిపడ్డారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే ఉలిక్కిపడుతున్నారని విమర్శించారు. వైసీపీ ఫ్యాక్షన్ ముఠాలకు తగిన గుణపాఠం చెబుతామన్నారు.