ఒడిశా రాష్ట్రంలో ప్రమాదానికి గురైన కోరమండల్, యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో మొత్తం 695 మంది ఏపీ వాసులు ప్రయాణించారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. వివరాలు వెల్లడించారు. ఏపీ ప్రయాణికుల్లో 553 మంది సురక్షితంగా ఉన్నారని.. 92 మంది తాము ట్రావెల్ చేయలేదని చెప్పారన్నారు. మిగిలిన వారిలో 28 మంది ఇంకా ఫోన్‌లోకి అందుబాటులోకి రాలేదన్నారు.
ఫోన్ నంబర్ ఆధారంగా లొకేషన్లు గుర్తించి వారి ఇళ్లకు అధికారులను పంపించి వివరాలు తెలుసుకుంటున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. మరో 22 మంది స్వల్పంగా గాయపడ్డారని.. వారికి చికిత్స కొనసాగుతోందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఆరుగురు అధికారులు ఒడిశా వెళ్లి అక్కడ క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. దీనిపై ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సమాచారాన్ని చేరవేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
రిజర్వేషన్ చార్ట్ ప్రకారం కోరమండల్‌లో 484 మంది ఏపీ ప్రయాణికులు, యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో 211 మంది ఉన్నట్లు బొత్స చెప్పారు. యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతిలో 107 మంది ఎక్కారని తెలిపారు. అయితే, అన్ రిజర్వుడ్ ప్రయాణికుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ఈ సమాచారాన్ని ఒడిశాలోని వివిధ ఆస్పత్రుల నుంచి మంత్రి గుడివాడ అమర్‌నాథ్, అధికారుల బృందం సేకరిస్తోందని చెప్పారు. ఇంకా 180 మృతదేహాల వివరాలను గుర్తించాల్సి ఉన్నట్లు అక్కడి నుంచి తమకు సమాచారం వచ్చిందన్నారు.