వైసీపీ నాలుగేళ్ల పరిపాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కృత ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మండిపడ్డారు. దోపిడీయే ఈ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని విమర్శించారు. వైసీపీ దుర్మార్గపు పాలనను అంతమొందించటానికి అందరూ కలిసి రావాలని ఆనం రామనారాయణరెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక పరిపాలన నడుస్తోందని ఆయన మండిపడ్డారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ..
40 సంవత్సరాల నుంచి తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నానని.. ఇలాంటి నిర్వీర్యమైన పరిపాలనను ఎప్పుడూ చూడలేదని ఆనం రాంనారాయణరెడ్డి అన్నారు. రాష్ట్రంలో అధికారులు స్వతంత్రంగా వ్యవహరించలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రజల అవసరాలను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. జిల్లా స్థాయి సమావేశాలకు విలువేలేదని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన వారు ఇద్దరే ఉన్నారని.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకరైతే, జిల్లా కలెక్టర్ మరొకరన్నారు. రాష్ట్రంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు అసలు అధికారమే లేదని దుయ్యబట్టారు. గ్రామానికి అధ్యక్షుడైన సర్పంచ్‌కి కూడా అధికారాలు లేవన్నారు.
చివరికి గ్రామ, వార్డు వాలంటీర్లకు ఉన్న అధికారం కూడా ఎమ్మెల్యేకు లేదని ఎమ్మె్ల్యే ఆనం రాంనారాయరెడ్డి అన్నారు. ఇలాంటి ప్రభుత్వం ఉంటే రాష్ట్రం అభివృద్ధికి నోచుకోదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కడైనా రాష్ట్ర ఆదాయం పెంచుకుని సంక్షేమ కార్యక్రమాలు చేయాలి కానీ, అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఇదొక్కటే అని దుయ్యబట్టారు. అప్పులు తెచ్చి ఎన్నికలకు ఓట్లు కొనుక్కుంటామని చెప్పే పార్టీ కూడా ఇదొక్కటే అని ఎద్దేవా చేశారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో రాష్ట్రంలో కొత్తగా ఒక్క ప్రాజెక్టు కట్టారా అని ఆనం రాంనారాయణ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ అయినా తీసుకొచ్చారా అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం కడతానన్న పోలవరం ప్రాజెక్టును నిలిపేసి.. చివరికి, కట్టలేమనే దుస్థితికి వచ్చారన్నారు. రాష్ట్రంలో పవర్ ప్రాజెక్టులు అమ్ముకునే పరిస్థితికి తీకొచ్చారని ఫైరయ్యారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని రామనారాయణరెడ్డి అన్నారు.