ఆరోగ్యశ్రీ, అయుష్మాన్ భారత్ పథకం కింద 3,257 ప్రొసీజర్స్‌కు ఉచిత వైద్యం అందజేస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ సేవలపై కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి బాఘోల్ ఏపీ, తెలంగాణ అధికారులతో హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి రజిని హాజరయ్యారు. ఏపీలో ఈ పథకానికి ఏటా రూ.3 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, 90 శాతం కుటుంబాలకు బీమా సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. ఈ రెండు పథకాల కింద రాష్ట్ర వ్యాప్తంగా 2,275 నెట్‌వర్క్ ఆస్పత్రుల ద్వారా ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. రోగులు కోలుకునే వరకూ ప్రభుత్వం ఆసరా పథకం కింద ఆర్థిక సాయం చేస్తోందన్నారు. అంతకుముందు కేంద్ర సహాయ మంత్రి బాఘెల్ ఆరోగ్యశ్రీ పథకం అద్భుతమని ప్రశంసించారు.