అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అంబే ద్కర్ భవన్ నందు ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2023 ను పురస్కరించుకొని జిల్లా కాలుష్య నియంత్రణ మండలి కాకినాడ వారి ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవం ఏర్పాటు చేసారు. సహజ సిద్ధ ప్రకృతి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ సమతుల్యత కొరకు ప్రతి ఒక్కరూ చిన్ననాటి నుండే మొక్కల పెంపకాన్ని సామాజిక బాధ్యత తో చేపట్టడంతో పాటు పర్యావరణానికి విఘాతం కలిగించే ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలని జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్తిబాబు పేర్కొన్నారు. ఈ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను స్వచ్ఛందంగా స్వీకరించాలని సూచించారు. పర్యావరణ సమతుల్యత జీవవైవిద్యాన్ని కాపాడేందుకు విరివిగా మొక్కలు పెంచాలని సూచించారు. జనాభా పెరుగుదల మూలంగా వృక్షాలను నరికి వేయడంతో సహజ ప్రకృతి సిద్ధ వాతావరణానికి అవరోధంగా మారుతోందన్నారు. పర్యావరణ సమతుల్యత ఉన్నప్పుడే వర్షాలు సకాలంలో కురిసి మానవ మనుగడ సజావుగా కొనసాగుతుందని ఆ దిశగా ప్రతి ఒక్కరూ అడవులు రక్షణ పర్యావరణ పరిరక్షణ కొరకు తమ వంతు బాధ్యత వహించాలన్నారు. ఈ సందర్భంగా కిమ్స్ వైద్య కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు పర్యావరణహితమైన సంచులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాలుష్య నియంత్రణ మండలి సిబ్బంది, కిమ్స్ వైద్య కళాశాల విద్యార్థినీ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.