చంద్రబాబు ఎంతమందితో కలిసొచ్చినా.. వైయస్ఆర్ సీపీని ఏం చేయలేరని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మరోసారి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, టీడీపీ అధినేత చంద్రబాబు భేటీపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు గంటసేపు చర్చలు జరిపారని.. ఊద కర్రతో నడిచే చంద్రబాబు రాజకీయంగా నిలబడలేరని ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో వైయస్ఆర్ సీపీ విజయోత్సవ మహాసభను నిర్వహించారు. సీఎం వైయస్ జగన్ నాలుగు సంవత్సరాల సుపరిపాలన, గడప గడపకు మన ప్రభుత్వం దిగ్విజయంగా పూర్తిచేసిన సందర్భంగా ఈ మహాసభను ఏర్పాటు చేశారు.