విజయనగరం జిల్లా, పాలకొండలో చార్జీ డబ్బులు ఎక్కువ తీసుకున్నాడని ఓ బాలుడు ఓ ఆటో డ్రైవర్‌పై కత్తితో దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే...... పాలకొండ పట్టణానికి చెందిన నలుగురు బాలురులు ఆదివారం స్థానిక కోటదుర్గమ్మ జంక్షన్ వద్ద ఆటో ఎక్కి పాలకొండ కాంప్లెక్స్‌లో దిగారు. చార్జీ తీసుకోమని రూ.200 నోటును గొల్లవీధికి చెందిన ఆటో డ్రైవర్ ఎం.శ్రీనివాసరావుకు ఇచ్చారు. ఒక్కొక్కరికి రూ.10 చొప్పున రూ.40 చార్జీ వసూలు చేసి మిగతా రూ.160ను ఆటో డ్రైవర్ వారికి ఇచ్చాడు. అంత మొత్తం తీసుకోవద్దని వారు శ్రీనివాసరావుతో గొడవపడ్డారు. ఈ క్రమంలో ఓ బాలుడు తన వద్ద ఉన్న కత్తితో శ్రీనివాసరావుపై దాడి చేశాడు. దీంతో పొట్ట భాగంలో గాయంకావడంతో ఆయన్ను స్థానికులు ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. నలుగురు బాలురులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. శ్రీనివాసరావుకు ఎటువంటి ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. ఓ బాలుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.