రైలు ప్రయాణాలు తాజాగా ప్రయాణికులకు ఓ సవాల్ గా మారుతున్నాయి. ఇదిలావుంటే మూడు రోజుల కిందట ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 275 మంది చనిపోగా.. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. బహానగ వద్ద షాలిమార్- చెన్నై కోరమండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, ఒక గూడ్స్ రైలు ఒకదానికొకటి ఢీకొనటంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సిగ్నిలింగ్ సిస్టమ్‌లో తలెత్తిన పొరపాటు వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
ఇదిలా ఉండగానే.. ఆదివారం రాత్రి మరో ట్రైన్‌కు ప్రమాదం తప్పింది. మచిలీపట్నం నుంచి తిరుపతి వెళుతున్న ట్రైన్‌లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ప్రకాశం జిల్లా టంగుటూరు స్టేషన్ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. వాటిని గుర్తించిన ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ట్రైన్‌ను నిలిపేసి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఒడిశా రైలు ప్రమాద ఘటన మరువక ముందే ట్రైన్‌లో మంటలు రావటంతో ప్రయాణికులు వణికిపోయారు. ట్రైన్ ఆపగానే బయటకు పరుగులు తీశారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.