సనాతన హైందవ ధర్మప్రచారంలో భాగంగా టీటీడీ దేశవ్యాప్తంగా అన్ని ముఖ్య పట్టణాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తోందని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఇటీవల సీతంపేట, రంపచోడవరంలో నిర్మించిన శ్రీవారి ఆలయాల్లో ఆగమోక్తంగా మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. జమ్మూలోని మజీన్ గ్రామంలో శ్రీవారి ఆలయం నిర్మాణం కోసం జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం 60 ఎకరాల భూమి కేటాయించిందని చెప్పారు. ఆభూమిలో దాదాపు రూ.30 కోట్ల వ్యయంతో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఈనెల 3 నుంచి 8 వరకు నిర్వహిస్తున్నామని చెప్పారు. 8న జరిగే మహాసంప్రోక్షణలో జమ్ముకాశ్మీర్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, జితేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొంటారని చెప్పారు.
ఇదిలావుంటే తిరుమల ఘాట్‌రోడ్లలో ఇటీవల డ్రైవర్ల నిర్లక్ష్యం, వాహనాల కండీషన్ బాగా లేనందు వల్ల కొన్ని ప్రమాదాలు జరిగాయని ఈవో వెల్లడించారు. ప్రమాదాల నివారణకు జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్ధం చేశామని చెప్పారు. డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ మాట్లాడకుండా, మలుపుల వద్ద పరిమిత వేగంతో, ఓవర్ టేక్ చేయకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు.