మూడు రైళ్ల ప్రమాద ఘటన దేశవ్యాప్తంగా విషాధం నింపిన విషయం తెలిసిందే. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఆదివారం రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఒడిశాలో రైలు ప్రమాద ప్రాంతంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ నేతృత్వంలోని అధికారుల బృందం సహాయక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో రైలు ప్రమాద ఘటనపై సహాయక చర్యలపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో చర్చించారు.
రైలు ప్రమాద క్షతగాత్రులను ఆదుకునేందుకు తీసుకున్న చర్యలను కేంద్ర మంత్రికి గుడివాడ అమర్నాథ్ వివరించారు. కాల్ సెంటర్ల నిర్వహణ ద్వారా బాధితులను త్వరగా గుర్తించి సహాయం అందించామని పేర్కొన్నారు. ఏపీలో ప్రతి జిల్లాకు ఒక కాల్ సెంటర్ నిర్వహణను రైల్వే మంత్రి అభినందించారు.
అంతకు ముందు మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. రైలు ప్రమాద ఘటనలో ఏపీకి చెందిన ప్రయాణికులు మృత్యువాత నుంచి దాదాపు బయటపడ్డారని, పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారని చెప్పారు. ప్రమాదంలో గాయపడ్డ ప్రయాణికులను ఒడిశా, భువనేశ్వర్, ఏపీ ప్రాంతాల్లోని వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో ఏపీకి చెందిన వారు 342 ప్రయాణిస్తున్నారని వారిలో 330 మందిని గుర్తించామని పేర్కొన్నారు. ఇందులో ఇప్పటి వరకు 331 మందిని గుర్తించామని, ఇంకా 11 మందిని గుర్తించాల్సి ఉందన్నారు.
మరోవైపు ఒడిశా ఘోర రైలు ప్రమాద ఘటనకు దారి తీసిన మూల కారణాన్ని కనుగొన్నామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్‌లో మార్పు కారణంగానే ప్రమాదం జరిగిందని చెప్పారు. సిగ్నలింగ్ పాయింట్‌లో మార్పులు చేసిన వారిని కూడా గుర్తించామని వెల్లడించారు. త్వరలో వారిపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. కవచ్‌కు, రైలు ప్రమాదానికి సంబంధం లేదని చెప్పారు. అయితే ప్రస్తుతం తమ ఫోకస్ మొత్తం పునరుద్ధరణ పనులపైనే ఉన్నట్లుగా స్పష్టం చేశారు. దర్యాప్తు నివేదిక అందిన తర్వాత మరిన్ని వివరాలు బహిర్గతమవుతాయని మంత్రి వెల్లడించారు.