హార్ట్ ఎటాక్ ఏ వయస్సు అన్న తేడా లేకుండా అందర్నీ బలితీసుకొంటోంది. ఇదిలావుంటే ఓ పెళ్లింట పెను విషాదం చోటుచేసుకుంది. అంగరంగ వైభవంగా వివాహం జరిగి.. బంధు మిత్రులతో ఇళ్లంతా కళకళలాడుతోంది. విధికి కన్నుకుట్టిందేమో మూడుముళ్లతో ఒక్కటై గంటలు కూడా గడవక ముందే నవదంపతులు గుండెపోటుతో కన్నుమూశారు. దీంతో ఆ ఇంట్లో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. ఈ విషాదకర ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే బహ్రైచ్ జిల్లా కైసర్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోధియా గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువకుడు ప్రతాప్ యాదవ్‌కు.. 22 ఏళ్ల యువతి పుష్పతో మంగళవారం వివాహం జరిగింది.
పెళ్లితంతు ముగిసిన తర్వాత మర్నాడు మొదటి రాత్రికి పెద్దలు ముహూర్తం నిర్ణయించారు. బుధవారం రాత్రి వధూవరులు శోభనం గదికి వెళ్లి గడియపెట్టుకున్నారు. కానీ, మర్నాడు ఉదయం గది నుంచి బయటకు రాకపోవడంతో కుటుంబసభ్యులు వారిని నిద్రలేపే ప్రయత్నాలు చేశారు. గది తలుపులు తట్టినా లోపలి నుంచి స్పందన రాకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. దీంతో బలవంతంగా తలుపులు తెరిచి చూసేసరికి ఇద్దరూ మంచంపై విగతజీవులుగా పడి ఉండటంతో ఏం జరిగిందో తెలియక కుటుంబసభ్యులు షాకయ్యారు.
ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నూతన దంపతుల మృతికి గుండెపోటు కారణమని పోస్టుమార్టంలో వెల్లడైనట్టు బహ్రైచ్ జిల్లా ఎస్పీ ప్రశాంత్ వర్మ వెల్లడించారు. ఇరువురుకి గతంలో గుండె సంబంధిత సమస్యలు గానీ ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పారు. తదుపరి పరిశీలన కోసం మృతదేహాలను లక్నోలోని స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపినట్టు చెప్పారు.
అయితే, స్థానిక పోలీసులు మాత్రం నవదంపతులు నిద్రపోయిన గదిలో వెంటిలేషన్ లేదని, ఈ క్రమంలో ఊపిరాడక కార్డియాక్ అరెస్ట్‌కు గురయి ఉంటారని చెబుతున్నారు. పెళ్లైన మర్నాడు పుష్ప, ప్రతాప్‌లకు మొదటి రాత్రి కావడంతో వారిని ఓ గదిలోకి పంపి.. కుటుంబసభ్యులు వేరే గదుల్లో నిద్రపోయారని చెప్పారు. గురువారం ఉదయం వరకు గదిలో నుంచి బయటకు రాలేదని తెలిపారు.