ఆకాశంలో రెండు విమానాలు చేసిన విన్యాసాలతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. గాల్లోకి ఎగిరిన ఓ ప్రైవేటు విమానం కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో మిలిటరీ ఫైటర్ జెట్ రంగంలోకి దిగింది. ఆ ప్రైవేటు విమానాన్ని ఆపేందుకు యత్నించగా.. పైలట్ స్పందించలేదు. దీంతో మెరుపు వేగంతో వెళ్లిన ఆ ఫైటర్ జెట్ ప్రైవేటు విమానాన్ని సున్నితమైన గగన తలం నుంచి తరిమికొట్టేందుకు ప్రయత్నించింది. అయితే ఆ ప్రైవేటు విమానం కొద్దిసేపు చక్కర్లు కొట్టి.. అటవీ ప్రాంతంలో కూలిపోయినట్లు గుర్తించారు. ఈ ఘటన అమెరికా రాజధాని వాషింగ్టన్ గగనతలంలో చోటుచేసుకుంది.
అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. టెన్నిసీ నగరంలోని ఎలిజబెత్‌టౌన్ నుంచి న్యూయార్క్ లాంగ్ ఐలాండ్‌లోని మెక్‌ఆర్థర్ ఎయిర్‌పోర్టుకు ఆదివారం ఓ బిజినెస్ జెట్ బయల్దేరింది. గాల్లోకి వెళ్లిన తర్వాత ఆ బిజినెస్ జెట్.. ఒక్కసారిగా తన మార్గాన్ని మార్చుకుంది. లాంగ్ ఐలాండ్ ఎయిర్‌స్పేస్‌లో కొద్దిసేపు చక్కర్లు కొట్టిన తర్వాత ఒక్కసారిగా వాషింగ్టన్ గగనతలంలోకి ప్రవేశించింది. అయితే భద్రతాపరంగా అది అత్యంత సున్నితమైన ప్రాంతం. అమెరికా క్యాపిటల్, అమెరికా శ్వేతసౌథం మీదుగా ఆ బిజినెస్ జెట్ ప్రయాణించడంతో సైన్యం అలర్ట్ అయింది. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ద్వారా ఆ బిజినెస్ జెట్ పైలట్‌తో మాట్లాడేందుకు యత్నించగా.. స్పందన రాలేదు. దీంతో ఎఫ్-16 ఫైటర్ జెట్ రంగంలోకి దిగింది.
జనావాసాల్లో ఫైటర్ జెట్లు సాధారణ వేగంతోనే వెళ్తాయి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రం ఈ ఫైటర్ జెట్లు సూపర్‌సోనిక్ స్పీడుతో వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. అయితే బిజినెస్ జెట్‌ను అడ్డుకునేందుకు ఎఫ్-16 ఫైటర్ జెట్.. ఈ సూపర్ సోనిక్ వేగంతో గాల్లోకి ఎగిరింది. దీంతో అక్కడ భీకర శబ్దాలు వచ్చాయి. వాషింగ్టన్, వర్జీనియా, మేరీల్యాండ్ ప్రాంతాలకూ ఈ శబ్దాలు వినిపించాయి. దీంతో స్థానిక ప్రజలు ఏం జరుగుతుందో తెలియక తీవ్ర ఆందోళన చెందారు. దీనికి తోడు బిజినెస్ జెట్ పైలట్ దృష్టిని తమ వైపు తిప్పేందుకు ఫైటర్ జెట్ నుంచి మంటలను కూడా వదిలారు. ఈ మంటలు చూసి ఆ ప్రాంతాల్లో ఉన్న వారు భయపడి ప్రజలు ఇళ్లల్లోకి పరిగెత్తారు.
ఈ విమానాల విన్యాసాలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. గోల్ఫ్ ఆడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఘటన కారణంగా బైడెన్ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదని తెలిపారు. విమానం అనుమానాస్పద ఘటన విషయాన్ని బైడెన్‌కు అధికారులు వివరించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
వాషింగ్టన్‌లో చక్కర్లు కొట్టిన బిజినెస్‌జెట్ వర్జీనియాలోని ఓ అడవి ప్రాంతంలో కూలినట్లు అధికారులు గుర్తించారు. చాలా ఎత్తులో ప్రయాణించిన ఆ బిజినెస్ జెట్..నిమిషానికి 30 వేల అడుగుల మేర కిందకి దూసుకువచ్చి కుప్పకూలిందని ఫ్లైట్ ట్రాకింగ్ సైట్లు తెలిపాయి. ఈ బిజినెస్ జెట్ ఫ్లోరిడాలోని ఎన్‌కోర్ మోటార్స్ అనే కంపెనీ పేరుతో ఉన్నట్లు గుర్తించారు. ఆ జెట్‌లో తన కుమార్తె, 2 ఏళ్ల మనవరాలు, పనిమనిషి, పైలట్ ఉన్నట్లు ఆ కంపెనీ ఓనర్ జార్ రాంపెల్ చెప్పారు. తన కోసం టెన్నిసీ నగరానికి వచ్చి తర్వాత వాళ్లు ఇంటికి వెళ్తుండగా.. ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. సంఘటనాస్థలంలో ఎవరూ ప్రాణాలతో కన్పించలేదని వర్జీనియా పోలీసులు వెల్లడించారు.