ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డ్యామ్ పేలడంతో ఉక్రెయిన్‌ వరద పోటు

international |  Suryaa Desk  | Published : Tue, Jun 06, 2023, 09:51 PM

ఉక్రెయిన్‌ ఏదైతే జరగకూడదని అనుకుందో అదే జరిగింది. మంగళవారం తెల్లవారుజామున నీపర్‌ నదిపై ఉన్న నోవా కఖోవ్కా డ్యామ్‌ను పేల్చివేయడంతో వరద పోటు మొదలైంది. దక్షిణ ఉక్రెయిన్‌లోని ఖెర్సాన్‌కు 30 కి.మీ దూరంలో ఉన్న ఈ హైడ్రోపవర్ డ్యామ్‌ వ్యూహాత్మకంగా చాలా కీలకమైంది. గత కొన్ని నెలలుగా ఈ డ్యామ్‌ సమీపంలో ఉక్రెయిన్, రష్యా సైన్యాల మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నోవా కఖోవ్కా డ్యామ్‌ను రష్యా దళాలలే పేల్చివేశాయని దక్షిణ ఉక్రెయిన్‌ మిలటరీ కమాండ్‌ ఆరోపించింది. అయితే, ఆక్రమిత ఉక్రెయిన్‌లోని రష్యా అధికారులు మాత్రం దీనిని ఉగ్రదాడిగా చెబుతున్నట్లు మాస్కో అధికార మీడియా టాస్‌ న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించింది.


స్థానిక రష్యా మేయర్‌ వ్లాదిమిర్‌ లియోనేటివ్‌ మాట్లాడుతూ ‘‘అర్ధరాత్రి 2 గంటల నుంచి కఖోవ్కా హైడ్రోపవర్ ప్లాంట్‌పై వరుసగా దాడులు జరుగుతున్నాయి. దీంతో గేటు వాల్వులు దెబ్బతిని నీటి లీకులు మొదలయ్యాయి. కొద్దిసేపటికే నియత్రించలేని విధంగా ప్రవాహం మొదలైంది’’ అని తెలిపారు. ఖెర్సాన్‌లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. మరో ఐదున్నర గంటల్లో వరద అక్కడకు చేరుతుందని దక్షిణ ఉక్రెయిన్ గవర్నర్ ఒల్కేశాండర్ ప్రొకుడిన్ అంచనావేస్తున్నారు.


ఈ డ్యామ్‌ పేల్చివేతతో స్థానిక ప్రజలు ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వేలాది మంది ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని టాస్ పేర్కొంది. ఇదే సమయంలో నీపర్‌ నదికి తూర్పున ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నవారు వెంటనే ఖాళీ చేయాలని ఉక్రెయిన్‌ అధికారులు హెచ్చరికలు జారీచేశారు. ఎలక్ట్రానిక్‌ వస్తువులు, అత్యవసరమైన పత్రాలు, నిత్యావసరాలు తీసుకొని అక్కడి నుంచి బయటపడాలని కోరారు. మైఖోలావికా, ఓల్హికా, లివొ, టియాంగికా, పోనియాటివ్కా, ఇవానివ్కా, టోకరివ్కా వంటి చుట్టుపక్కల పది గ్రామాలు ఖాళీ చేయాలని సూచించారు.


డ్యామ్‌ పేల్చివేతను ఉక్రెయిన్‌ అధికారులు పర్యావరణ విధ్వంసంగా అభివర్ణించారు. మరోవైపు, డ్యామ్‌ విధ్వంసంపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. ఇందులో నేషనల్‌ సెక్యూరిటీ, డిఫెన్స్‌ కౌన్సిల్‌ సభ్యులు పాల్గొననున్నారు. ఇక, కఖోవ్కా హైడ్రోపవర్ ప్రాజెక్ట్‌లో భాగంగా 1956లో ఈ డ్యామ్ నిర్మించారు. 30 మీటర్లు ఎత్తు, కొన్ని వందల మీటర్ల పొడవు ఉండే ఈ రిజర్వాయర్‌లో 18 క్యూబిక్‌ కిలోమీటర్ల నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం ఉంది.


ఈ పరిమాణం గ్రేట్‌ సాల్ట్‌ లేక్‌లోని నీటికి సమానం. ఈ డ్యామ్‌ నుంచి విడుదలయ్యే వరద ఖేర్సాన్‌ వైపు ప్రవహించి భారీ నష్టాన్ని సృష్టించగలదు. యుద్ధం ఆరంభంలో దీనిని రష్యా దళాలు చేజిక్కించుకున్నా... గతేడాది అక్టోబర్‌లో ఉక్రెయిన్‌ సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి ఈ రిజర్వాయర్‌ను పేల్చివేస్తారనే భయాందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే జపోరిజియా అణు విద్యుత్ కర్మాగారం రష్యా స్వాధీనంలోకి వెళ్లడంతో ఉక్రెయిన్‌కు కరెంట్ కష్టాలు వెంటాడుతున్నాయి. తాజాగా ఈ డ్యామ్‌ పేల్చివేతతో కష్టాలు మరింత పెరగనున్నాయి.


కఖోవ్కా ఆనకట్ట క్రిమియన్ ద్వీపకల్పానికి నీటిని సరఫరా చేస్తుంది. అలాగే, జపోరిజియా అణు విద్యుత్ కేంద్రాన్ని చల్లబరిచేందుకు ఈ నీటినే వినియోగిస్తారు. ఈ నేపథ్యంలో అణు విద్యుత్ ప్లాంట్ భద్రతపై అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్టు తెలిపింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com