మనదేశంలోని రైళ్లకు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. ఒడిశాలో రైలు ప్రమాదం తీవ్ర విషాదం నింపిన వేళ.. సంచలన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థలో తీవ్ర స్థాయి లోపాలు ఉన్నట్లు ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు 3 నెలల కిందటే హెచ్చరించారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ దృష్టికి తీసుకొచ్చారు. ‘ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్’ వ్యవస్థలో ఎలాంటి ఘోరమైన పొరపాట్లు జరుగుతున్నాయో ఆధారాలతో సహా వివరించారు. ప్రయాణికుల ప్రాణాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆ అధికారి ఏం చెప్పారు? దీని గురించి ఆయన హెచ్చరించి 3 నెలలు గడుస్తున్నా.. ఎందుకు చర్యలు తీసుకోలేదు?
ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌లో మార్పు’ కారణంగానే ఒడిశాలో ప్రమాదం జరిగిందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రాథమికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో- ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ వైఫల్యాన్ని ఆ ఉన్నతాధికారి గతంలోనే ఎత్తిచూపిన విషయం చర్చనీయాంశమవుతోంది.
సౌత్ వెస్టర్న్ (నైరుతి) రైల్వే జోన్ ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేటింగ్ మేనేజర్ ఈ ఏడాది ఫిబ్రవరి 9న ఉన్నతాధికారులకు ఓ లేఖ రాశారు. అంతకుముందు రోజు సాయంత్రం చోటు చేసుకున్న ఓ అనూహ్య ఘటన గురించి అందులో ప్రస్తావించారు. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌కు ఎంతటి ఘోర ప్రమాదం తప్పిందో వివరించారు.
‘08.02.2023న సుమారు 17.45 గంటల సమయంలో చాలా తీవ్రమైన, అసాధారణమైన సంఘటన జరిగింది. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ (రైలు నం: 12649 ) ఒకటో మార్గం (అప్ రూట్) బయలుదేరుతుండగా.. అడ్వాన్స్ స్టార్టర్ కోసం పేపర్ లైన్ క్లియర్ టికెట్ (PLCT) కూడా వచ్చింది. మార్గం క్లియర్‌గా ఉందని సిగ్నల్ రావడంతో లోకో-పైలట్ రైలును ముందుకు పోనిచ్చాడు. అయితే, రైలు పాయింట్ నెం: 65 Aను చేరుకోవడానికి ముందు రైలును అత్యవసరంగా నిలిపివేశాడు. అక్కడ పాయింట్ డౌన్ మెయిన్ లైన్‌కు సిగ్నల్ సెట్ చేసి ఉందని గుర్తించాడు. అప్ రూట్లో వెళ్తున్న రైలుకు డౌన్ రూట్లో సిగ్నల్ ఇవ్వడం ఏంటని గుర్తించి రైలును నిలిపివేడంతో ఘోర ప్రమాదం తప్పింది. ఆ తర్వాత రైల్వే అధికారులను అప్రమత్తం చేశాడు’ అని అధికారి రాసుకొచ్చారు.
ఇంటర్‌లాకింగ్ ఉన్న ప్రకారమే రైలు వెళ్లి ఉంటే, ఘోర ప్రమాదం జరిగి ఉండేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘సిగ్నలింగ్ వ్యవస్థలో తీవ్ర లోపాలు ఉన్నాయని ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది’ అని లేఖలో ఆయన పేర్కొన్నారు. కొన్నిసార్లు సిగ్నల్ ప్రకారం రైలు ప్రారంభమయ్యాక, అది వెళ్లాల్సిన ట్రాక్ మారిపోతోందని ఆయన తెలిపారు. తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టాలని, ఈ వైఫల్యాలను గుర్తించి, నివారించాలని ఆయన కోరారు. లేకపోతే ఘోర ప్రమాదాలు జరిగే ముప్పు ఉందని హెచ్చరించారు.
ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం (జూన్ 2) సాయంత్రం చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదానికి కారణం ‘ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్’ వ్యవస్థలో లోపమేనని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ అధికారి రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. ఘటనకు బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ లేఖను షేర్ చేస్తూ.. విమర్శలు కురిపిస్తున్నారు. వీరిలో బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి కూడా ఉన్నారు. ‘అందుకే రైల్వే మంత్రిని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం’ అని ఆయన పోస్టు చేశారు.