నేడు కృష్ణా, గుంటూరు జిల్లాల కాలువలకు నీరు విడుదల చేశామని మంత్రి అంబటి రాంబాబు తెలియజేసారు. పూర్వం జూన్ నెలాఖరులో, జులై మొదటి వారంలో వదిలేవారని.. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో నెల ముందే నీరు ఇచ్చామని తెలిపారు. త్వరగా ఖరీఫ్ ప్రారంభం కావడం వల్ల మూడు పంటలు పండే అవకాశం ఉందన్నారు. ప్రకృతి విపత్తుల నుంచి కూడా రైతుకు ఇబ్బంది ఉండదన్నారు. సాగర్ నుంచి రాకుండానే పులిచింతలలో 34 టీఎంసీల నీరు ఉందని, అక్కడి నుంచే నీటిని రైతులకు అందిస్తున్నామని చెప్పారు. ఈ యేడాది పట్టిసీమ నుంచి నీరు తెచ్చే అవసరం ఉండదని అన్నారు. పులిచింతలలో 34 టీఎంసీల నీరు సరిపోతుందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక నీటి కొరత అనేదే లేదని తెలిపారు. వైఎస్, జగన్‌మోహన్ రెడ్డి పాలనలో సమృద్ధిగా వర్షాలు పడతాయని నిరూపణ అయ్యిందన్నారు. వర్షాల వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటే ముందస్తుగా చర్యలు తీసుకుంటామన్నారు. కృష్ణా వరదల నుంచి క్షేమంగా ఉండేలా ప్రజల కోసం రిటైనింగ్ వాల్ నిర్మాణం చేశారన్నారు. ప్రజల కోసం పూర్తి స్థాయిలో రక్షణ కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ కొనియాడారు.