రాష్ట్రంలోని పంచాయతీల నిధులు కాజేస్తున్న జగన్ సర్కార్‌పై సర్పంచ్‌లంతా కలసి సమర శంఖారావం పూరిస్తున్నట్టు ఏపీ సర్పంచ్‌ల సంఘం, ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ వ్యవస్థాపక అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. కాకినాడలో మంగళవారం నిర్వహించిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సర్పంచ్‌ల సదస్సులో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో 12,918 పంచాయతీల్లో ఉన్న 3.5 కోట్ల గ్రామీణ ప్రజానీకం సంక్షేమం, అభివృద్ధి కోసం ఉద్యమం చేస్తున్నామన్నారు. ప్రజల అవసరాల కోసం శానిటేషన్, విద్యుత్తు లైట్లు, తాగునీరు, డ్రైనేజీల వంటి కనీస అవసరాల కోసం అధిక వడ్డీలకు సర్పంచ్‌లు అప్పులు చేసి పనులు చేశారన్నారు. ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడంతో వడ్డీలు కట్టలేక, పనులు చేసే పరిస్థితి లేక ప్రజలచేత అవమానాలకు గురికావాల్సిన దుస్థితిని సీఎం జగన్ కల్పించారని విమర్శించారు. ప్రకాశం జిల్లాలో ఓ మహిళా సర్పంచ్ అప్పులు కట్టలేక, బిల్లులు రాక ఆత్మహత్యకు పాల్పడిందని ఆయన తెలిపారు. నిధులు, విధులు సాధించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఐక్యంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.