ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ మహిళ వివాహేత సంబంధం ఏర్పరచుకుని చివరకు హత్యకు గురైంది. ఆమె పూర్తి వివరాలు సేకరించిన పోలీసులు హత్యగా నిర్ధారించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపు తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి జిల్లా ఎంవి–90 గ్రామానికి చెందిన ఓ మహిళకు సుమారు 15 సంవత్సరాల క్రితం ఓ వ్యక్తితో పెళ్లి జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. మృతురాలు తన సొంత మరిదితో వివాహేతర సంబంధం పెట్టుకుని ఏడాది క్రితం అక్కడి నుంచి పారిపోయి ఆరు నెలల క్రితం చింతలపూడి మండలం సీతానగరం వైఎస్సార్ కాలనీలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. మరిది దగ్గరలో ఉన్న పామాయిల్ ఫ్యాక్టరీలో రోజువారి కూలీగా పనిచేస్తుంటాడు. ఇంటి దగ్గర మృతురాలు టైలరింగ్ చేస్తుంటుంది. ఈ నెల 3న తాను భద్రాచలం వెళ్తున్నానని బయటవారికి చెప్పి వెళ్లిపోయాడు. చీకటిపడినా రాకపోవడం.. ఇంటిలో లైటు వెలగకపోవడంతో అనుమానం వచ్చి ఎదురింటిలో ఉంటున్న ఓ మహిళ వెళ్లి చూడగా ఆమె బాత్ రూంలో పడి ఉంది. ఆమె మరిదికి ఫోన్ చేయగా తాను భద్రాచలంలో ఉన్నానని, బయలుదేరి వస్తున్నానని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. విషయం తెలిసిన వీఆర్వో 4న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇంటిని పరిశీలించగా మృతురాలి మెడకు చీరచుట్టి చంపినట్టుగా ఉందని, ఆమె కాల్ డేటా ద్వారా స్వగ్రామం ఏదో తెలుసుకుని ఎస్‌ఐ హరికృష్ణ ను అక్కడకు పంపినట్టు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం.వి.ఎస్. మల్లేశ్వరరావు తెలిపారు. అయితే మృతదేహాన్ని ఆ గ్రామానికి తీసుకు రావడానికి కుటుంబ సభ్యులు నిరాకరించారన్నారు. మృతురాలి అసలు భర్త, సొంత అన్నను తీసుకువచ్చి మృతదేహాన్ని చూపిన తరువాత పోస్టుమార్టం నిర్వహించి మంగళవారం మృతదేహాన్ని పాతిపెట్టడం జరిగిందని సీఐ తెలిపారు.