ఉత్తరాంధ్రలో ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన అనకాపల్లి నూకాంబిక అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులకు గురువారం శ్రీకారం చుట్టనున్నారు. సుమారు ఆరున్నర కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే ఈ పనులకు ఉదయం 7. 42 గంటలకు శంకుస్థాపన చేస్తారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్రసరస్వతి భూమి పూజ చేస్తారని ఆలయ సహాయ కమిషనర్ బండారు ప్రసాద్ తెలిపారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా గర్భాలయం, అంతరాలయం, విశాలమైన అనివెట్టి మండపాన్ని రాతితో నిర్మిస్తారు.
ప్రస్తుతం తూర్పు వైపున మాత్రమే రాజగోపురం వుంది. మిగిలిన మూడు దిక్కుల్లో కూడా రాజగోపురాలు నిర్మించి, వీటిని అనుసంధానం చేస్తూ ప్రాకార మండపాలను నిర్మిస్తారు. కశింకోటకు చెందిన వేదపండితులు శ్రీమాన్ రేజేటి రామాచార్యుల పర్యవేక్షణలో ఆలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడానికి దేవదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఎంపీ డాక్టర్ బీవీ సత్యవతి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఇతర అధికార, అనధికార ప్రముఖులు పాల్గొంటారని, మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆలయ ప్రాంగణంలో మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఈవో బండారు ప్రసాద్ చెప్పారు.