నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్‌పై ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. సీఐడీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాల మేరకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన వైద్య పరీక్షల నివేదికలు భద్రపరచాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. గురువారం హైకోర్టులో విచారణకు రావడంతో రఘురామ కృష్ణ రాజు తరపు న్యాయవాది వీవీ లక్ష్మినారాయణ వాదనలు వినిపించారు. కార్డియాలజీ, జనరల్ మెడిసిన్, రేడియాలజీ వైద్యుల నివేదికలను భద్రపరచాలని న్యాయవాది కోరారు. రెండు సంవత్సరాలు పూర్తి అవ్వడంతో ఈ నివేదికలను ధ్వంసం చేసేందుకు అధికారులు ప్రభుత్వ అనుమతి కోరినట్లు కోర్టు దృష్టికి లాయర్ తీసుకొచ్చారు. అలా చేస్తే ఈ కేసు దర్యప్తులో కీలక ఆధారాలు మాయం అయిపోతాయని... వీటన్నింటినీ భద్రపరచి కోర్టుకు ఇవ్వాల్సిందిగా లక్ష్మీనారాయణ కోరారు. దీనిపై వెంటనే లిఖిత పూర్వక కౌంటర్లు దాఖలు చేయాలని గుంటూరు ఆసుపత్రి సూపరెండెంట్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, ఆరోగ్య శాఖ కమిషనర్‌లను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు ధర్మాసనం వచ్చే మంగళవారం(జూన్ 13)కు వాయిదా వేసింది.