సీఎం జగన్‌మోహన్ రెడ్డి అసమర్థత, కమీషన్ల కక్కుర్తి రాష్ట్ర విద్యుత్ రంగాన్ని, ప్రజల్ని దెబ్బతీస్తోందని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ విమర్శలు గుప్పించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. 2014 నుంచి 2019 మధ్య రాష్ట్రంలో ఒక్కో కుటుంబం ఎంత విద్యుత్ ఛార్జీలు చెల్లించింది.. ఈ 4 ఏళ్లనుంచి ఎంత చెల్లిస్తోందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలపై రూ.57వేలకోట్ల విద్యుత్ ఛార్జీల భారం పడటానికి ప్రధాన కారణం జగన్ సర్కారు అవినీతి నిర్ణయాలని విమర్శించారు. కమీషన్ల కోసం బయట మార్కెట్‌లో అధిక ధరకు విద్యుత్ కొనడం, నాసిరకం బొగ్గుకొనుగోళ్లు, కేంద్రవిద్యుత్ సంస్థలనుంచి కొనుగోళ్లు నిలిపేయడం, వ్యవసాయమోటార్లు, ఇళ్లకు స్మార్ట్ మీటర్లు పెట్టడం లాంటి కారణాలతో ప్రజలపై మోయలేని భారం మోపారన్నారు. ఇప్పటికి 7సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్.. సంక్షేమం పేరుతో ఇచ్చేదానికంటే అదనంగా విద్యుత్ ఛార్జీలపేరుతో దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.