ముస్లిం సమాజానికి అత్యంత ప్రాధాన్యమైన నెల్లూరు బారాషహీద్ దర్గా, స్వర్ణాల చెరువు వద్ద పారిశుధ్యం అధ్వానంగా ఉందని ఈనెలలో బక్రీద్ పండుగ కూడా ఉన్నందున స్వర్ణాల చెరువును సందర్శించి పారిశుద్ధ్య పనులు, స్వర్ణాల చెరువులో ఉన్నటువంటి గుర్రపు డెక్కను తొలగింపు పనులు చేయవలసిందిగా ముస్లిం మత పెద్దలు నగర మేయర్ స్రవంతి జయవర్ధన్ ను నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని మేయర్ ఛాంబర్ నందు గురువారం కలిసి కోరారు. ఈ సందర్భంగా నగర మేయర్ స్రవంతిజయవర్ధన్ సానుకూలంగా స్పందించారు. సందర్భంగా మేయర్ మాట్లాడుతూ బారాషహీద్ దర్గాపై నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి పనులు నిర్వహించడం జరిగిందన్నారు. మత పెద్దలు కోరినట్లుగా స్వర్ణాల చెరువులో గుర్రపు డెక్కను తీయించడం, దర్గా పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులలో ప్రత్యేక దృష్టి పెట్టి నిర్వహిస్తామని ఆమె హామీ ఇచ్చారు.