ప్రతి బాలుడు, బాలిక తప్పనిసరిగా స్కూల్లో చేరాలని, 100శాతం జీఈఆర్ సాధించే దిశగా ముందుకు సాగాలని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రతి మండలంలో రెండు జూనియర్ కాలేజీలు ఉండేలా చూసుకోవాలని, – ఒకటి బాలికలకు, రెండోది కో–ఎడ్యుకేషన్ ఉండాలని సూచించారు. 2023 విద్యా సంవత్సరంలో టెన్త్, ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభావంతులకు జగనన్న ఆణిముత్యాలు పురస్కారాలు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం విద్యాశాఖలో చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలు తీరును, వాటి పురోగతిపై సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు.