ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో ల్యాండ్‌ స్కామ్‌, లిక్కర్‌ స్కామ్‌,,,జే.పీ.నడ్డా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 10, 2023, 08:24 PM

రాష్ట్రంలో ల్యాండ్‌ స్కామ్‌, లిక్కర్‌ స్కామ్‌ జరుగుతోందని  భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా  తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆయన ఆరోపించారు. శ్రీకాళహస్తిలో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జేపీ నడ్డా మాట్లాడుతూ.. ఏపీలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిపాలనను పూర్తి గాలికి వదిలేసిందన్నారు. అనేక ప్రాజెక్టులకు రాష్ట్ర వాటా ఇవ్వడం పోవడం వల్లే పనులన్నీ నిలిచిపోయాయని నడ్డా విమర్శించారు.


ఇక, ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయరని జేపీ నడ్డా అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలను బాధ్యతాయుత పాలిటిక్స్‌ వైపు మళ్లించారని తెలిపారు. దేశమంతా అభివృద్ధి జరగాలనే విధానం వైపు ప్రధాని మోదీ మొగ్గు చూపారని పేర్కొన్నారు. పేదలు, ఎస్సీలు, రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మోదీ ప్రధాన మంత్రి అయ్యే నాటికి దేశంలో విద్యుత్‌ లేని గ్రామాలు 19 వేలు ఉండేవని వివరించారు. ఇవాళ దేశంలో విద్యుత్‌ సౌకర్యం లేని గ్రామమే కనిపించదన్నారు. గతంలో 59 గ్రామాలకు మాత్రమే ఫైబర్‌ కేబుల్‌ ద్వారా ఇంటర్నెట్‌ సౌకర్యం ఉండేదని.. ఇప్పుడు 2 లక్షలకు పైగా గ్రామాలకు ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిందని వివరించారు.


దేశంలో 50 కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం రూ. 5 లక్షల బీమా సౌకర్యం కల్పించిందని జేపీ నడ్డా అన్నారు. ఇప్పటికే ప్రజల చికిత్సల కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 80 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఉజ్వల పథకం కింద రూ. 9 కోట్ల మందికి ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చిందని జేపీ నడ్డా తెలిపారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com