మన సమాజంలో పెళ్లిళ్లు కూడా వింత తరహాలో సాగుతుంటాయి. ఇదిలావుంటే ఉత్తర్ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లా బారుసాగర్కు చెందిన మన్వీంద్ర అనే యువకుడికి.. దగ్గర్లో ఉన్న మరో గ్రామంలో ఉన్న జ్యోతి అనే యువతికి వివాహం నిశ్చయించారు. జూన్ 6 వ తేదీన మన్వీంద్ర, జ్యోతిల వివాహం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వధూవరుల ఇద్దరు బంధువులు.. రాత్రి బరాత్‌లో పాల్గొని ఉత్సాహంగా గడిపారు. అనంతరం అప్పగింతల కార్యక్రమం పూర్తి చేసి వధువును వరుడి ఇంటికి సాగనంపారు. మరుసటి రోజు అయిన జూన్ 7 వ తేదీన రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా.. పెళ్లి కూతురు సవతి తండ్రి అందరికీ షాకిచ్చాడు. వరుడికి 3 విచిత్రమైన షరతులు విధించాడు.
కొత్త దంపతులు ఇద్దరూ సెక్స్ చేసుకోవద్దని ప్రధానంగా షరతు విధించాడు. దీంతోపాటు వధువుతోపాటే ఆమె చెల్లెలు కూడా వరుడి ఇంటికి వస్తుందని.. ఆమెతో పాటే ఉంటుందని చెప్పాడు. ఇక తాను ఏ సమయంలోనైనా కుమార్తె ఇంటికి వస్తానని.. ఎందుకు వచ్చావని ఎవరూ అడగకూడదని షరతు విధించాడు. వధువు సవతి తండ్రి విధించిన 3 షరతులకు అటు వరుడితోపాటు రిసెప్షన్‌కు హాజరైన బంధువులు, అతిథులు.. నోరెళ్ల బెట్టారు.
వధువు సవతి తండ్రి పెట్టిన షరతులకు వరుడు షాక్‌కు గురయ్యాడు. ఆ షరతులు అంగీకరించక పోవడంతో రిసెప్షన్ మధ్యలోనే ఆగిపోయింది. దీంతో పెళ్లి కూతురు.. తన చెల్లి, తండ్రితో పాటు తన ఇంటికి వెళ్లిపోయింది. ఈ ఘటనపై కోపంతో పెళ్లి కొడుకు తరఫు కుటుంబసభ్యులు.. స్థానికంగా ఉన్న బారుసాగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పెళ్లికి దాదాపు రూ. 10 లక్షల వరకు ఖర్చు అయిందని.. పెళ్లి కూతురుకు రూ. 3 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు పెట్టామని పేర్కొన్నారు. పెళ్లి కూతురును తీసుకెళ్లిన సవతి తండ్రి.. ఆమె ఒంటిపై ఉన్న బంగారం, వెండి కూడా తీసుకెళ్లడం గమనార్హం. దీనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే విచారణ పూర్తిచేస్తామని చెప్పారు.