నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఇటీవల రాజీనామా చేసిన శరద్ పవార్.. పార్టీ కార్యకర్తల ఒత్తిడితో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీకి ఇద్దరు కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్‌లను నియమిస్తూ నిర్ణయం ప్రకటించారు. కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్‌లుగా శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేతోపాటు ప్రఫుల్ పటేల్‌లకు బాధ్యతలు అప్పగించారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 25 వ ఆవిర్భావ దినోత్సవాల్లో ఈ నిర్ణయాన్ని పార్టీ అధినేత శరద్ పవార్ ప్రకటించారు. సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్‌లు పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌లుగా సేవలు అందిస్తారని పేర్కొన్నారు. ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ల ప్రకటన సమయంలో ఆ పార్టీ సీనియర్ నేత అజిత్ పవార్ కూడా అక్కడే ఉండటం గమనార్హం. 1999 లో శరద్ పవార్, పీఏ సంగ్మా కలిసి.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు.
గత నెలలో పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి శరద్ పవార్ సంచలన విషయం వెల్లడించారు. ఆ పార్టీ నేతలు, కార్యకర్తల ముందు సమావేశంలో ఈ ప్రకటనను వెలువరించారు. దీంతో ఈ నిర్ణయాన్ని పవార్ వెనక్కి తీసుకోవాలని ఆ పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. చివరకు ఎన్‌సీపీ ప్యానెల్ ఏర్పాటై.. రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మే 5 న కోరింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు.. ఇటీవల అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర సీఎం పదవి కోసం 2024 అసెంబ్లీ ఎన్నికల వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదని అజిత్ పవార్ అన్నారు. సీఎం పదవికి ఇప్పుడు కూడా సిద్ధమేనని వెల్లడించారు.