ముస్లింలకు పవిత్రమైన స్థలం మక్కా. ఏ ముస్లిం అయినా.. జీవితంలో ఒక్కసారైనా మక్కాను దర్శించుకోవాలని కోరుకుంటారు. అయితే ఈ హజ్ యాత్ర చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నది కాబట్టి చాలా మంది సాధారణ ముస్లింలు అక్కడికి వెళ్లలేకపోతారు. అయినప్పటికీ ఆ వ్యక్తి పట్టు వదలలేదు. ఎలాగైనా సరే మక్కాకు చేరుకోవాలని సంకల్పించాడు. దీంతో పాదయాత్రను ప్రారంభించాడు. ఏడాదికి పైగా ప్రయాణం సాగిస్తూ 8,600 కిలోమీటర్లు నడిచి.. చివరకు మక్కా చేరుకున్నాడు. అతనే కేరళకు చెందిన షిహాబ్ చోటూర్. దేశ విదేశాల నుంచి హజ్ యాత్ర కోసం ఎంతో మంది ముస్లింలు ఏటా మక్కాకు వెళ్తుంటారు. ఈ మతపరమైన యాత్రలో పాల్గొనేందుకు భారత్ నుంచి దాదాపు 1,75,000 మంది వెళ్లనున్నారు.
గతేడాది జూన్ 2 న కేరళలోని మలప్పురం జిల్లాలోని వాలంచేరిలోని తన ఇంటి నుంచి షిహాబ్ చోటూర్ ప్రయాణం ప్రారంభించాడు. ఈ సుదూర ప్రయాణంలో ఎన్నో దేశాలను దాటుకుని వెళ్లాడు. మొత్తానికి ఒక సంవత్సరం పైన 5 రోజుల్లో అంటే సుమారు 370 రోజులు ప్రయాణించి మక్కా చేరుకున్నాడు. ఈ ప్రయాణంలో పాకిస్థాన్, ఇరాన్, ఇరాక్, కువైట్ దేశాలను దాటుకుంటూ సౌదీ అరేబియాలో అడుగు పెట్టాడు. ఇందులో భాగంగా చాలా చోట్ల కొన్నిరోజులు విశ్రాంతి తీసుకున్నాడు. సౌదీ అరేబియాలో అడుగు పెట్టిన తర్వాత ఇస్లాం మతంలోనే అత్యంత ముఖ్యమైన తీర్థ క్షేత్రమైన మదీనాకు చేరుకున్నారు. అక్కడ షిహాబ్ 21 రోజుల పాటు ఉన్నాడు. అక్కడి నుంచి మక్కాకు 440 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ దూరాన్ని షిహాబ్ 9 రోజుల్లో చేరుకున్నాడు.
ఇస్లామిక్ దేశమైన పాకిస్థాన్.. షిహాబ్ చేస్తున్న హజ్ యాత్రను కూడా అడ్డుకుంది. గతేడాది జూన్‌లో యాత్ర ప్రారంభించిన షిహాబ్.. వివిధ రాష్ట్రాలను దాటుకుంటూ భారత్ - పాక్ బోర్డర్‌లో ఉన్న వాఘా సరిహద్దులకు చేరుకున్నాడు. అక్కడి నుంచి పాకిస్థాన్‌లోకి అడుగు పెట్టాలని భావించాడు. అయితే అక్కడ షిహాబ్‌కు వీసా లేదని పాక్ అధికారులు అడ్డుకున్నారు. దీంతో ట్రాన్సిట్ వీసా కోసం నెల రోజుల పాటూ షిహాబ్ పాకిస్థాన్‌లోని ఓ పాఠశాలలో ఉండాల్సి వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో షిహాబ్‌కు ట్రాన్సిట్ వీసా లభించడంతో ప్రయాణానికి మార్గం సుగమమైంది. దీని తర్వాత మళ్లీ నడక ప్రారంభించిన షిహాబ్.. 4 నెలల తర్వాత మక్కా చేరుకున్నాడు.
షిహాబ్‌కు సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో తన అనుభవాలను.. ఆ యూట్యూబ్ ఛానెల్‌లో అందించేవాడు. తాను ఎక్కడ ఎక్కడ నివసించింది.. ఎలా ప్రయాణించింది.. అక్కడ ఎన్ని కష్టాలను అనుభవించింది అన్న విషయాలను తన యూట్యూబ్ ఛానెల్‌లోని సబ్‌స్క్రైబర్లతో పంచుకునేవాడు.