లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోకపోతే.. ఈ ఏడాది జరిగే ఏషియన్ గేమ్స్‌ను బాయ్‌కాట్ చేస్తామని కేంద్ర ప్రభుత్వానికి రెజ్లర్లు అల్టిమేటం జారీ చేశారు. . తమ డిమాండ్లను పరిష్కరించకపోతే పోటీల్లో పాల్గొనేదే లేదని తేల్చి చెప్పారు. సమస్యల పరిష్కారానికిజూన్ 15 వరకు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ సమయం ఇచ్చారని.. తర్వాత ఏం చేయాలన్న దానిపై భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. తాము రోజు రోజుకూ మానసికంగా ఎంత తీవ్రంగా బాధపడుతున్నామో ప్రభుత్వానికి అర్థం కావడం లేదని ఆరోపించారు.
ఈ మేరకు హర్యాణాలోని సోనిపట్‌లో రైతులు నిర్వహించిన ఖాప్ పంచాయత్‌లో రెజ్లర్లు పాల్గొన్నారు. స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, వినేశ్ ఫోగాట్ కూడా ఈ ఖాప్ పంచాయత్‌కు హాజరయ్యారు. ప్రభుత్వంతో జరిగిన చర్చలకు సంబంధించిన విషయాలను ఖాప్ పంచాయత్ లో రైతులతో పంచుకుంటామని బజ్‌రంగ్ పూనియా వెల్లడించారు. ఇదే సమయంలో రెజ్లర్ల మధ్య ఐక్యత కరవైందని మీడియా అడిగిన ప్రశ్నకు సాక్షి మాలిక్ సమాధానం ఇచ్చారు. తాను, బజరంగ్ పూనియా, వినేశ్ ఫోగాట్ ముగ్గురూ ఇప్పుడు ఒక్కటిగానే ఉన్నామని.. ఎప్పటికీ ఇలాగే ఉంటామని సాక్షి మాలిక్ స్పష్టం చేశారు. జూన్ 15 తర్వాత ఎక్కడి నుంచి ఆందోళనలు చేయాలనేది త్వరలో నిర్ణయిస్తామని చెప్పారు.
బుధవారం కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో రెజ్లర్లు.. 5 గంటల పాటు సమావేశం అయ్యారు. ఈ భేటీలో రెజ్లర్ల సమస్యలు పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి.. లిఖిత పూర్వక హామీని వారికి ఇచ్చారు. జూన్ 15 లోగా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వస్తున్న ఆరోపణలపై విచారణ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ లిఖిత పూర్వక హామీలో బ్రిజ్ భూషణ్ అరెస్టును మాత్రం ప్రస్తావించక పోవడం గమనార్హం.
దేశ రాజధాని ఢిల్లీలో రెజ్లర్లు రెండు నెలలుగా నిరసనలు చేస్తున్నారు. తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్‌ను పదవి నుంచి తొలగించి అరెస్ట్ చేయాలని.. డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కార్యాలయంలో ఢిల్లీ పోలీసులు సీన్ రీక్రియేషన్ చేశారు. దానికి మహిళా రెజ్లర్ సంగీతా ఫోగాట్‌ను తీసుకెళ్లి.. బ్రిజ్ భూషణ్.. వారిని ఏ విధంగా వేధించాడన్న దానిపై విచారణ జరిపారు. ఈ కేసు విచారణలో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం.. 180 మందికి పైగా విచారణ జరిపింది.
అయితే పోలీసులు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కార్యాలయం నుంచి వెళ్లిపోగానే మీడియాలో వచ్చిన వార్తలపై వినేశ్ ఫోగాట్.. అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు సీన్ రీక్రియేషన్ కోసం అక్కడికి వెళ్తే.. రెజ్లర్లు రాజీ కోసం వెళ్లారని కొన్ని మీడియాల్లో వచ్చిందని ఆమె ట్వీట్ చేశారు. ఇది బ్రిజ్ భూషణ్ అధికార బలానికి నిదర్శనమని ఆమె వ్యాఖ్యానించారు. బ్రిజ్ భూషణ్ తన అధికార, రాజకీయ బలంతో తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నాడని ఆరోపించారు. అందుకే అతన్ని అరెస్ట్ చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పోలీసులు తమపై విరుచుకుపడే బదులు.. బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్ చేస్తే న్యాయం జరుగుతుందనే ఆశ ఉంటుందని వినేశ్ ఫోగాట్ పేర్కొన్నారు.