ప్రస్తుత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సైతం పెద్ద ఎత్తున అప్పులు చేస్తోందని మాజీ ముఖ్యమంత్రి, ఇటీవలే భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి దుయ్యబ్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాస్తవాలు చెప్పాలనే ఉద్దేశంతోనే తాను తిరిగి రాజకీయాల్లోకి వచ్చానని ఆయన చెప్పారు. విశాఖపట్నంలో హోం మంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం రూ. 315 కోట్లు మాత్రమే అప్పు చేశామన్నారు. కానీ, గత తెలుగు దేశం పార్టీ ప్రభుత్వంలో రూ. 40 వేల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు. ప్రస్తుత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సైతం పెద్ద ఎత్తున అప్పులు చేస్తోందని దుయ్యబ్టారు. రాష్ట్ర విభజన జరిగిన ఈ పదేళ్ల కాలంలో ఎన్ని వేల కోట్ల రూపాయిలు అప్పులు చేస్తున్నారో అంతుబట్టడం లేదన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే హ్యాపీగా ఉందని.. ప్రజలు మాత్రం లేరని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సంక్షేమ పథకాలు అనేవి ప్రజల అభివృద్ధికి మార్గాలు వేసేవిగా ఉండాలన్నారు. దేశంలో బీజేపీ నాయకత్వం బలంగా ఉందని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంటోందన్నారు. అలాగే, కర్ణాటక ఎన్నికల తర్వాత ఈవీఎంల మీద ఉన్న అపోహలు తొలగిపోయాయని చెప్పారు. రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ కీలకంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.
అలాగే, ప్రజలకు వాస్తవాలు చెప్పాలనే ఉద్దేశంతోనే తాను తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యానని కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ డైరెక్షన్ నచ్చకే ఆ పార్టీకి దూరం అయ్యానని.. ఈ క్రమంలో బీజేపీ ఒక్కటే తనకున్న ఆప్షన్ అని చెప్పుకొచ్చారు. రైతులు, మహిళా సంఘాలకు జీరో వడ్డీ అనేది ఏపీ, తెలంగాణలో పేపర్లకే పరిమితమైందని ఆయన విమర్శించారు. క్రాప్ లోన్స్ కూడా సక్రమంగా అందడం లేదన్నారు. సంక్షేమ పథకాల వల్ల పేద ప్రజలకు శాశ్వత ప్రయోజనం చేకూర్చడం ప్రభుత్వం బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి ప్రభుత్వంలో కొత్తగా 80 వేల ఉద్యోగాలు కల్పించామని.. గడిచిన 9 ఏళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో ప్రజలు ఆలోచించాలని కిరణ్‌కుమార్ రెడ్డి సూచించారు.