మూగజీవాలను ఆటపట్టించడం మంచిది కాదు, కానీ కొందరు వ్యక్తులు వికృత చేష్టలతో వాటిని ఇబ్బందులు పెడుతుంటారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం జంతువులను హిసించి, క్రూరంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా, ఇలాగే ఓ వ్యక్తి మొసలితో పరాచికాలు అడి, ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక కొలను చుట్టూ కొంత మంది గుమిగూడి ఉండగా.. నీటిలోకి దిగిన ఓ వ్యక్తి అక్కడ మొసలిని ఆటపట్టించాడు. తొలుత మొసలి తోక పట్టుకుని లాగి.. తర్వాత దాని నోటికి దగ్గరగా చేయిపెట్టాడు. అనంతరం తన కాలును పైకెత్తి నోటికి దగ్గరగా తీసుకొస్తూ రెచ్చగొట్టాడు.
అతడి చేష్టలతో మొసలికి చిర్రెత్తుకొచ్చినట్టుంది అమాంతం ఆ కాలును నోటకరించింది. దీంతో చుట్టూ ఉన్నవారు లోపలికి దిగి అతడ్ని మొసలి బారి నుంచి రక్షించే ప్రయత్నం చేశారు. ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అతడికి తగిన శాస్తి జరిగిందని కామెంట్లు పెడుతున్నారు. ‘ఇలాంటి పనులు చేసే వ్యక్తులకు ఇలా జరిగాల్సిందే.. దీనికి అర్హులు’అని ఒకరు.. మన పర్యావరణం, వన్యప్రాణులతో సామరస్యంగా జీవించడం నేర్చుకోవడానికి మానవులమైన మనం ఇంకా చాలా దూరం వెళ్లాలి’ అని వ్యాఖ్యానించారు.