భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఢిల్లీ పోలీసుల దర్యాప్తు తీరుపై రెజ్లర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ రెజ్లర్లు ఇచ్చిన ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా, ఈ ఆరోపణలకు బలం చేకూర్చే ఆధారాలుంటే సమర్పించాలని రెజ్లర్లను ఢిల్లీ పోలీసులు కోరినట్లు సమాచారం. ఫొటోలు, వీడియోలు, వాట్సప్ చాటింగ్‌లు ఏవి ఉన్నా తమకు అందజేయాలని సూచించినట్టు తెలుస్తోంది. మరోవైపు, ఈ కేసులో పోలీసులు కూడా సొంతంగా ఆధారాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.
కేసుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని రెజ్లర్లకు ఢిల్లీ పోలీసులు సీఆర్‌పీసీ 91 నోటీసులు అందజేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీని ప్రకారం కేసు విచారణకు అవసరమైన ఎలాంటి డాక్యుమెంట్ల అయినా దర్యాప్తు అధికారి కోరవచ్చు. అందులో భాగంగా ఫిర్యాదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలున్నా తమకు అందజేయాలని ఫిర్యాదు చేసిన రెజ్లర్లను కోరారు.
మరోవైపు, బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్న రెజ్లర్లలో ఒకరైన బజరంగ్ పూనియా ఓ జాతీయ మీడియా ఛానల్‌తో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. పోలీసుల దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంపీని రక్షించే చేసే ప్రయత్నం జరుగుతోందని, ఆయన జైలుకు వెళ్లకుండా బయట ఉండటం దర్యాప్తునకు ఆటంకం కలుగుతోందని అన్నారు.
‘బ్రిజ్ భూషణ్ సింగ్ అక్కడ ఉన్నప్పటికీ పోలీసులు నిన్న ఒక మహిళా రెజ్లర్‌ను రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యాలయానికి తీసుకెళ్లారు. బ్రిజ్ భూషణ్ ఆఫీసులో ఉన్నారా అని ఆమె అడిగారు.. లేరని పోలీసులు అబద్ధం చెప్పారు.. అక్కడ ఉన్నాడని తెలిసి ఆమె భయపడింది’ అని పూనియా చెప్పారు.
ఇదిలావుంటే తన సొంత రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్‌లోని గోండాలో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఆదివారం భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీని తక్షణమే బహిష్కరించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన బలాన్ని చాటుకునేందుకు బ్రిజ్ భూషణ్ ఈ ర్యాలీకి నిర్వహిస్తోన్నట్టు తెలుస్తోంది.
బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా అగ్రశ్రేణి రెజర్లు చేపట్టిన ఆందోళన ఉద్ధృతమవడంతో స్పందించిన కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్.. వారితో చర్చలు జరిపారు. బ్రిజ్ భూషణ్‌పై ఈ నెల 15 లోపు ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తామని, జూన్ 30 లోపు డబ్ల్యూఎఫ్‌ఐకి ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్రం హామీ ఇవ్వడంతో.. రెజ్లర్లు తమ ఉద్యమానికి తాత్కాలికంగా విరామం ప్రకటించారు.