కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దేశంలో అతి పెద్దదైన ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్ మొదటి దశను ఫిబ్రవరి 12న ప్రారంభించారు. అయితే, రహదారి ప్రారంభించిన నాలుగు నెలల్లోనే ఈ రహదారిపై ఓ వంతెన పగుళ్లు ఇచ్చింది. గురుగ్రామ్‌కు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలోని నుహు సమీపంలో మహున్ గ్రామం వద్ద ఉన్న వంతెనలోని చిన్న భాగం పగుళ్లు వచ్చి కూలిపోయింది. ఈ పగుళ్లను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు వారం రోజుల కిందటే గుర్తించి, మరమ్మతులు చేపట్టారు. దీనికి ముందు వంతెన పగుళ్ల విషయాన్ని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు వచ్చి పరిశీలించారు.
ఫిరోజ్‌పూర్ ఝిర్కా, పినాంగ్‌వాన్‌లను కలిపే 21 అడుగుల పొడవైన వంతెన చిన్న భాగంలో పగుళ్లు ఏర్పడినట్లు ఎన్ హెచ్ ఏఐ అధికారులు మీడియాకు తెలిపారు. అయితే, దాని పగుళ్లు కనిపిస్తున్నాయని స్థానికులు ఆరోపించారు. మరికొందరు ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన నెల రోజుల్లోనే ఇలా అయ్యిందని చెబుతున్నారు. ‘వంతెన ఉపరితలంలోని దాదాపు నాలుగు అడుగుల్లో రెండు అడుగుల భాగం మాత్రమే కుంగినట్టు గుర్తించాం.. నిర్మాణ నాణ్యతను పరిశీలించడానికి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు.. దీనిపై స్వతంత్ర దర్యాప్తు.. విచారణ కూడా జరుగుతోంది.. వంతెన జాయింట్ వద్ద కొన్ని సమస్యలు ఉన్నాయి’ అని ఎన్‌హెచ్ఏఐ ప్రాజెక్ట్ సభ్యుడు మనోజ్ కుమార్ చెప్పారు.
మొత్తం 1380 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం రూ.98,000 వేల కోట్లతో చేపట్టారు. మొదటి దశలో 246 కిలోమీటర్లు పూర్తిచేయగా.. రూ.12,150 కోట్లు ఖర్చు చేశారు. ప్రస్తుతం పలు చోట్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ఎక్స్‌ప్రెస్ వే వల్ల ఢిల్లీ-ముంబయి మధ్య ప్రయాణ సమయం సగానికి సగం తగ్గనుంది. ఢిల్లీ, హరియాణా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర ఆరు రాష్ట్రాల గుండా కోటా, ఇండోర్, జైపూర్, భోపాల్, వడోదర, సూరత్ వంటి ప్రధాన నగరాల మీదుగా ఇది సాగుతుంది.