సీబీఐ అనేది స్వతంత్ర సంస్థ అని, దానిపై ఎవరి ప్రభావం ఉండదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆమె విశాఖలో మీడియాతో మాట్లాడుతూ సీబీఐ వ్యవహారంలో ఎవరి జోక్యం ఉండదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావలసినవి వస్తున్నాయని, నిధులు ఇస్తే ఇచ్చారని, ఇవ్వకపోతే ఇవ్వలేదని మీడియానే అంటుందన్నారు. చంద్రబాబు , అమిత్ షా భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని, అమిత్ షాను ఎవరైనా కలవచ్చునని అన్నారు. పొత్తులు అనేవి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయని, జనసేన , బీజేపీ కలిసే ఉన్నాయని పురందేశ్వరి స్పష్టం చేశారు.