స్టీల్‌ప్లాంటును ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం కార్మికులు కూర్మన్నపాలెం వద్ద జాతీయ రహదారిపై కొద్దిసేపు బైఠాయించారు. ‘అమిత్ షా గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ మాట్లాడుతూ.. ఉక్కు కర్మాగారాన్ని తన తాబేదార్లయిన అదానీ, అంబానీలకు కట్టబెట్టాలన్న కుయుక్తులు పన్నడం తప్ప నరేంద్రమోదీ ఈ తొమ్మిదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు చేసిందేమీ లేదన్నారు. కమిటీ మరో చైర్మన్ మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా ఏర్పడిన ఉక్కు కర్మాగారాన్ని విక్రయించే అధికారం బీజేపీకి ఎక్కడిదని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలుపుదల చేస్తున్నట్టు ప్రకటించాలని డిమాండ్ చేశారు. కమిటీ నాయకులు జె.అయోధ్యరామ్ మాట్లాడుతూ లక్షలాది మంది ఆధారపడి వున్న ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడం సబబేనా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో కమిటీ నాయకులు, అధిక సంఖ్యలో కారికుఉలు పాల్గొన్నారు.