ఎవరైనా ఏదైనా చర్చి ముందుకు వెళ్తే ఏం కనిపిస్తుంది. యేసు క్రీస్తు, మేరీ మాత విగ్రహాలు దర్శనమిస్తాయి. అదే దక్షిణ ఐరోపాలోని ద్వీప దేశమైన మాల్టాకు వెళ్తే.. ప్రతీ చర్చి ముందు 2 గడియారాలు కనిపిస్తాయి. అయితే ఆ రెండు గడియారాలు కూడా రెండు వేర్వేరు రకాల సమయాన్ని తెలుపుతాయి. దీంతో కొత్తగా అక్కడికి వెళ్లినవారు ఆ రెండు గడియారాలను చూసి తికమక అయిపోతారు. అక్కడి వారిని అడిగి దాని వెనక ఉన్న చరిత్ర తెలుసుకునే వరకు వదిలి పెట్టరు. ప్రపంచంలోని అతి చిన్న దేశాల్లో ఒకటైన మాల్టా మొత్తం జనాభా సంఖ్య 5.2 లక్షలు. అక్కడ దాదాపు 360 చర్చిలు ఉన్నాయి .
అయితే మాల్టాలోని చర్చిల ముందు రెండు గడియారాలు ఎందుకు పెడుతున్నారన్న దానిపై అక్కడి వారు వేర్వేరు కథలు చెబుతారు.
ఇందులో ఏది కరెక్ట్ అన్నదానిపై మాత్రం ఎవరూ ఒక ముగింపుకు రాలేకపోతున్నారు. దీనిపై చరిత్రకారులు అధ్యయనం చేస్తున్నారు. అయితే ఎక్కువ మంది స్థానికులు మాత్రం.. దెయ్యాలు వచ్చినపుడు వాటిని గందరగోళానికి గురి చేసేందుకే చర్చిల ముందు రెండు రకాల గడియారాలు పెట్టారని నమ్ముతున్నారు. ఎప్పుడైనా చర్చిలో ప్రార్థనలు జరుగుతున్నపుడు దెయ్యాలు వస్తే అవి తికమక పడిపోతాయని అక్కడి వారి నమ్మకం. అయితే అక్కడ ఉన్న రెండు గడియారాలు వేర్వేరు సమయాలు తెలుపుతున్నా.. చర్చికి వచ్చే వారు మాత్రం.. అందులో మోగించే గంటల శబ్దాన్ని బట్టి ప్రార్థనలకు వస్తారని చెబుతున్నారు.
అయితే మరికొందరు మాత్రం వీటిని ఖండిస్తున్నారు. ఈ రెండు గడియారాలను రైతులు, మత్య్సకారుల కోసం ఏర్పాటు చేశారని విశ్వసిస్తారు. అందులో ముందుగా సమయాన్ని చూపించే గడియారం రైతుల కోసమని.. దాని ఆధారంగా వారు ఉదయాన్నే లేచి పొలాలకు వెళ్లేందుకు ఉపయోగపడుతుందని చెబుతారు. ఇంకో గడియారం.. జాలర్ల కోసమని పేర్కొన్నారు. ఈ జాలర్లు.. సమయంతో సంబంధం లేకుండా అలల తాకిడి, రుతువుల ఆధారంగా సముద్రంలో చేపల వేటకు వెళ్తారని చెబుతారు. మరికొందరు.. ఈ గడియారాల్లోని ఒకటి స్థానిక సమయాన్ని సూచిస్తుందని.. మరొకటి రోమ్ సమయాన్ని చూపిస్తుందని నమ్ముతారు.
18వ శతాబ్దంలో ఈ సంప్రదాయం మొదలైందని మరికొంతమంది చెబుతారు. దేశంలో ఉన్న దుష్ట ఆత్మలను వెళ్లగొట్టేందుకు ఈ రెండు గడియారాలను పెట్టారని స్థానికంగా ఉండే జానపద సాహిత్యం పేర్కొంటోంది. 18 వ శతాబ్దంలో మాల్టాలోని ఓ గ్రామంలో పంటలు పండకపోవడం, అంటు వ్యాధులు ప్రబలడం, ఆకస్మిక మరణాలు సంభవించడం వంటివి జరిగినట్లు చెబుతారు. దీంతో తమ ఊరికి ఏదో తెలియని దుష్ట శక్తి పట్టిందని మతాధికారి వద్దకు వెళ్లారు. దీనికి పరిష్కారం.. ఊరిలోని కూడలిలో రెండు గడియారాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలా చేసిన తర్వాత ఆ ఊర్లో పంటలు బాగా పండాయి. అంటు వ్యాధులు, ఆకస్మిక మరణాలు తగ్గిపోయాయి. దీంతో అప్పటి అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు.