ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్, చైనాల మధ్య మూడేళ్లుగా ప్రతిష్టంభన,,,భారతీయ జర్నలిస్ట్‌ల వీసా పునరుద్దరణకు నో

international |  Suryaa Desk  | Published : Mon, Jun 12, 2023, 10:34 PM

చైనాలోని చిట్టచివరి భారతీయ జర్నలిస్ట్‌ తమ దేశం వదిలి వెళ్లాలని జిన్‌పింగ్ సర్కారు తాజాగా ఆదేశించింది. భారత్, చైనాలు ఒకరి రిపోర్టర్‌లను ఒకరినొకరు బహిష్కరించడం రెండు ఆసియా దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం చేసింది. ఈ నెలలో తమ దేశం విడిచి వెళ్లాలని ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా రిపోర్టర్‌ను చైనా అధికారులు ఆదేశించినట్లు ఈ విషయం గురించి తెలిసిన ఓ వ్యక్తి పేర్కొన్నారు. తాజా పరిణామాలు ఇరు దేశాల మధ్య క్షీణిస్తున్న సంబంధాలకు నిదర్శనం. అంతేకాదు, ఈ చర్యలతో చైనాలో భారతదేశ మీడియా ఉనికిని పూర్తి కనుమరుగుకానుంది.


ఈ ఏడాది ఆరంభంలో వివిధ భారత మీడియా సంస్థలకు చెందిన నలుగురు రిపోర్టర్లు చైనాలో ఉండేవారు. హిందూస్థాన్ టైమ్స్ రిపోర్టర్ గతవారం వచ్చేయగా.. ప్రభుత్వ రంగానికి చెందిన ప్రసార భారతి, ది హిందూ దినపత్రికకు చెందిన ఇద్దరు జర్నలిస్టులకు ఈ ఏడాది ఏప్రిల్‌లో వీసా పునరుద్ధరణకు చైనా నిరాకరించింది. ఇదిలా ఉండగా, ఈ పరిణామాలపై స్పందించడానికి చైనా విదేశాంగ మంత్రి, విదేశాంగ శాఖ నిరాకరించాయి.


అటు, మన దేశంలో ఒక్క చైనా జర్నలిస్ట్‌ గత నెలలో భారత్‌ను వీడారు. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. జన్హూ, చైనా సెంట్రల్ టెలివిజన్‌కు చెందిన ఇద్దరు జర్నలిస్ట్‌‌ల వీసాలను పునరుద్దరించడానికి భారత్ నిరాకరించింది. చైనా రిపోర్టర్లు దేశంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, అయితే చైనాలోని భారతీయ జర్నలిస్టులకు మాత్రం ఆ పరిస్థితి లేదని భారత ప్రభుత్వం ఈ నెల ప్రారంభంలో ఆరోపించింది. ఈ సమస్యపై ఇరు దేశాలు సంప్రదింపులు జరుపుతున్నాయని పేర్కొంది.


చైనాలో భారతీయ జర్నలిస్ట్‌లు సహాయకుల నియామకం కోసం కొన్ని నెలల కిందట వీసా ప్రక్రియ ప్రారంభమైందని ఈ విషయం గురించి తెలిసిన భారతీయ అధికారులు పేర్కొన్నారు. ఇది సున్నితమైన అంశం కావడంతో తన పేరును వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. పరిమితుల కారణంగా ముగ్గురు సిబ్బంది నియామకానికి చైనా అధికారుల నుంచి అనుమతులు తప్పనిసరి. ఈ విషయంలో భారత్‌లో నియామకాలపై పరిమితి లేదు.


భారత్, చైనాల మధ్య 2020 మే మొదటి వారం నుంచి ప్రతిష్టంభన కొనసాగుతోంది. అయితే, ఈ వివాదాన్ని పక్కనబెట్టి వాణిజ్యం, ఆర్థిక సంబంధాలపై దృష్టిసారిద్దామని చైనా కోరుతోంది. కానీ, భారత్ మాత్రం సరిహద్దు వివాదం పరిష్కారం కాకుండా సంబంధాలు సాధారణ స్థితికి చేరడం కష్టమని తెగేసి చెబుతోంది. జీ20, షాంఘై సహకార ఆర్గనైజేషన్‌ శిఖరాగ్ర సమావేశానికి ఈ ఏడాది భారత్ ఆతిథ్యం ఇస్తుండగా వీసా తిరస్కరణ అంశం చోటుచేసుకోవడం గమనార్హం. రాజకీయ, దౌత్యపరమైన సంబంధాలను నెలకొల్పడంపై దృష్టి సారించిన చైనా.. సెప్టెంబరులో జరిగే జీ20 నేతల సమావేశానికి ఆ దేశ అధినేత షీ జిన్‌పింగ్ హాజరయ్యే అవకాశం ఉంది.


జర్నలిస్టు వీసాల విషయంలో చైనా, అమెరికా మధ్య కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. కొన్ని చైనా మీడియా సంస్థలను విదేశీ మిషన్లుగా పేర్కొంటూ అమెరికాలోని చైనా జర్నలిస్టుల సంఖ్యపై ట్రంప్ యంత్రాంగం పరిమితులను విధించింది. అనంతరం అమెరికా రిపోర్టర్ల గుర్తింపును చైనా రద్దు చేసి కౌంటర్ ఇచ్చింది. 2020లో ఆస్ట్రేలియా, చైనాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తీవ్రం కావడంతో అక్కడ ఉన్న ఇద్దరు ఆస్ట్రేలియన్ జర్నలిస్టులపై ఆంక్షలు విధించింది. దీంతో ఆస్ట్రేలియా దౌత్యవేత్తలు చర్చలు జరిపే వరకు కాన్సులర్ రక్షణలో ఐదు రోజులు గడిపారు. అదే ఏడాది, చైనా ప్రభుత్వ మీడియా సిబ్బంది ఇళ్లపై దాడి చేసి వారి ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు కాన్‌బెర్రాపై బీజింగ్ ఆరోపించింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com