తమిళనాడులో ఆదివారం పర్యటించిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బీజేపీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు నుంచి భవిష్యత్తులో ఓ ప్రధాని రావాలన్నది తన ఆశ అని, లోక్‌సభ ఎన్నికల్లో ఈ రాష్ట్రం నుంచి 25 నియోజకవర్గాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ శ్రేణులకు కేంద్ర హోం మంత్రి సూచించారు. ఈ వ్యాఖ్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ అంటే మీకెందుకు అంత కోపం అని? ఆయన ప్రశ్నించారు.
‘తమిళనాడు నుంచి ఓ ప్రధాని రావాలనే సలహాను నేను స్వాగతిస్తున్నాను.. కానీ, మోదీపై ఆయనకు (అమిత్ షా) ఎందుకు కోపమో నాకు తెలియదు’ అని వ్యాఖ్యానించారు. ‘ఒకవేళ తమిళులు ప్రధాని కావాలనే ఆలోచన బీజేపీకి ఉంటే తమిళిసై సౌందరరాజన్ (తెలంగాణ గవర్నర్), ఎల్ మురుగన్ (కేంద్ర మంత్రి) ఉన్నారు. వారికి ప్రధానమంత్రి అభ్యర్థులుగా అవకాశం వస్తుందని భావిస్తున్నాను’ అని స్టాలిన్ ఎద్దేవా చేశారు.
అయితే, కొంత మంది సీనియర్ బీజేపీ నేతల ప్రకారం.. గతంలో డీఎంకేకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలను ప్రధాని కాకుండా ఆ పార్టీ అడ్డుకుందని అమిత్ షా అన్నట్టు తెలుస్తోంది. కే కామరాజ్, జీకే మూపనార్‌లను ప్రధానమంత్రి కాకుండా డీఎంకే అడ్డుకుందని పార్టీ కార్యకర్తల సమావేశంలో అమిత్ షా ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై స్టాలిన్ ధీటుగా స్పందించారు. అటువంటి ప్రకటనను అమిత్ షా బహిరంగంగా చేస్తే, డీఎంకే వివరణ ఇస్తుందని తమిళనాడు సీఎం సవాల్ విసిరారు.
ఇదే సందర్భంలో తమిళనాడు కోసం కేంద్రం చేపడుతున్న చర్యల గురించి షా చేసిన వ్యాఖ్యలను కూడా డీఎంకే ప్రశ్నించింది. ఆయన చెప్పిన విధంగా నిధుల కేటాయింపు ప్రభుత్వ రాజ్యాంగ విధిలో భాగమని పేర్కొంది. డీఎంకే పార్లమెంటరీ పార్టీ నాయకుడు టీఆర్ బాలు మాట్లాడుతూ.. స్టాలిన్ కోరినట్లుగా షా ఎలాంటి ప్రత్యేక పథకాలను ఎత్తి చూపలేకపోయారని అన్నారు.