అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె.. తమ గుండెల మీద తన్ని, ప్రియుడితో వెళ్లిపోయింది. అలా చేయొద్దని.. తమ పరువు తీయొద్దని వాళ్లు ఎంతగా వేడుకున్నా.. చెప్పా పెట్టకుండా ఇంట్లోంచి వెళ్లిపోయి ప్రియుడిని పెళ్లాడింది. అది ఆ తల్లిదండ్రులను తీవ్రంగా బాధించింది. దీంతో కుమార్తెకు కర్మకండాలు చేశారు. 11వ దినం కూడా నిర్వహించి బంధువులందరినీ పిలిచి భోజనాలు పెట్టించారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లా గోహల్పూర్ పరిధిలోని అంఖేరా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బతికున్న తమ కుమార్తె ఫోటోకు దండ వేసి, నర్మదా నది తీరంలో పిండప్రదానం చేస్తున్న తల్లిదండ్రుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జబల్పూర్ జిల్లా అంఖేరా గ్రామానికి చెందిన దంపతులు తమ కుమార్తె అనామిక దూబె (25)ను పాతికేళ్లు కష్టపడి అల్లారుముద్దుగా పెంచారు. అయితే, ఆమె అదే గ్రామానికి చెందిన మహ్మద్ అయాజ్ అనే ముస్లిం యువకుడిని ప్రేమించింది. ఈ విషయం అనామిక ఇంట్లో వాళ్లకు తెలియడంతో ఆమెను మందలించారు. అయితే, ఆమె వారికి ఎదురు తిరిగింది. అతడినే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పింది.
దగ్గరి బంధువులను పిలిపించి వారితో కుమార్తెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఆ దంపతులు. దీంతో ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయి, ప్రియుడితో కలిసి కోర్టు మెట్లెక్కింది. తామిద్దరం మేజర్లమని.. ఇద్దరి ఇష్టంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని, తమ తల్లిదండ్రులు, బంధువులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేసింది. దీంతో కోర్టు వారికి పెళ్లి చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది.
కోర్టు ఆదేశాలతో.. జూన్ 7న ముస్లిం సంప్రదాయాల ప్రకారం అనామిక తన ప్రియుడిని వివాహం చేసుకుంది. తల్లిదండ్రులు పెట్టిన పేరును వదిలేసి ఉజ్మా ఫాతిమాగా పేరు మార్చుకుంది. ఆ పేరు కింద తన తల్లిదండ్రుల పేర్లను యథావిధిగా ప్రింట్ చేయించింది. దీంతో ఈ పెళ్లి కార్డు వైరల్ అయ్యింది. తమ మాటను ఎదిరించి అన్య మతస్థుడిని పెళ్లి చేసుకోవడమే కాకుండా.. పెళ్లి కార్డులో తమ పేర్లను ముద్రించడం ఆ తల్లిదండ్రులకు ఆగ్రహాన్ని తెప్పించింది. కోపంతో వారు తమ కూతురు చనిపోయిందంటూ.. కర్మకాండలు జరిపించారు.
ఆదివారం (జూన్ 11) గౌరీ ఘాట్లో అనామికకు పిండప్రదానం చేసి నర్మదా నదిలో కలిపేశారు ఆమె తల్లిదండ్రులు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ‘లవ్ జిహాద్’ను ప్రస్తావిస్తూ.. కొంత మంది కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి దృశ్యం చూడాల్సి వస్తుందని తాను ఏ రోజూ అనుకోలేదని చెప్తూ.. అనామిక సోదరుడు కంటతడి పెట్టుకున్నాడు. తమ తల్లిదండ్రులు ఆమెకు ఘనంగా వివాహం జరిపించి ఉండేవారని.. కన్యాదానం చేయాల్సిన చేతులతో ఇప్పుడు పిండప్రదానం చేశారని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు.